కేసీఆర్‌ యూటర్న్.. కూతురికి మైలేజ్ లభించకూడదనే?

KCR Planned U Turn

ఏపీ మద్యం కుంభకోణం కేసు, తెలంగాణలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు రెండూ ఇంచు మించు ఒకేసారి క్లైమాక్స్ చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో జగన్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందని ఆయనతో సహా సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు నమ్ముతున్నారు.

తెలంగాణ కేసులలో ఇప్పటికిప్పుడు కాకపోయినా త్వరలో ఏదో రోజు కేసీఆర్‌ అరెస్ట్‌ ఖాయమనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాళేశ్వరం కేసులో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ ఎదుట ఈ నెల 5న కేసీఆర్‌ విచారణకు హాజరు కావలసి ఉండగా అందుకు తాను సిద్దమేనన్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. కనుక కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఆయనకి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపిస్తుండటంపై నిరసన తెలియజేసేందుకు ఒకరోజు ముందుగా అంటే రేపు (బుధవారం) ఇందిరా పార్కులో ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు.

ADVERTISEMENT

కానీ కేసీఆర్‌ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. జూన్ 5న తనకు వేరే కార్యక్రమాలు ఉన్నందున మరో రోజున వస్తానని తెలియజేశారు. కమీషన్‌ అందుకు అంగీకరించి ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని మరో నోటీస్ పంపింది. అంటే విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్‌ మరికొంత సమయం కోరినా హాజరవ్వాలని నిర్ణయించుకున్నారని, ఆయన అభ్యర్ధన మేరకు కమీషన్ మరో నోటీస్ పంపిందని స్పష్టమవుతోంది.

మరి అటువంటప్పుడు కల్వకుంట్ల కవిత నిరసన తెలియజేస్తూ ధర్నా చేయడం దేనికి?అంటే రాజకీయ మైలేజ్ పొందడం కోసమే అని అర్దమవుతోంది. ఆమెకు ఆ మైలేజ్ దక్కకూడదనే కేసీఆర్‌ హటాత్తుగా వాయిదా కోరారా? అనే సందేహం కలుగుతుంది.

ఏది ఏమైనప్పటికీ, కేసీఆర్‌ వాయిదా తీసుకున్నారు కనుక ఆమె కూడా తన ధర్నా వాయిదా వేసుకుంటారా? లేక రేపే ధర్నా చేస్తారా? అనే విషయం మరికొద్ది సేపటిలో తెలియవచ్చు. కానీ ఈ కేసు విచారణ క్లైమాక్స్ వరకు వచ్చేసింది. కనుక కేసీఆర్‌ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నా ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చు.

ఒకవేళ ఈ కేసుని కేసీఆర్‌ కోర్టులో పడేసి తప్పించుకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే కావచ్చు. ఆ కేసులో జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు వినిపించాయి.

పోలీసుల ఎన్నికల సమయంలో వాహనాలలోనే నగదు నియోజకవర్గాలకు తరలింపజేసి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులకు అందించినట్లు ఆరోపణలున్నాయి. ఈ రెండు చాలా తీవ్రమైన నేరాలే. కనుక ఈ కేసు కేసీఆర్‌ మెడకు చుట్టుకుంటే బయటపడటం చాలా కష్టమే కావచ్చు.

ADVERTISEMENT
Latest Stories