జగిత్యాల సభలో కేసీఆర్ మొట్ట మొదట బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారిన కూతురు కల్వకుంట్ల కవిత, ఆమె రాజకీయాలు, కొత్త పార్టీ గురించి మాట్లాడుతారని అందరూ ఎదురు చూశారు.
ఆమె వలన కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్‌కు ప్రమాదం ఏర్పడేలా ఉంది. కనుక ఆమెపై ‘కుటుంబ ద్రోహి’, ‘బీఆర్ఎస్ ద్రోహి’, జాతిపితనైన తనని విమర్శిస్తున్నందున ‘తెలంగాణ ద్రోహి’ అనే మూడు ముద్రలు వేస్తే చాలు. ఆమె పార్టీ ప్రకటించక మునుపే తెలంగాణలో రాజకీయ ఏకాకిగా మారి నష్టపోతారు.
కానీ కేసీఆర్ తన ప్రసంగంలో ఆమె ప్రస్తావన చేయలేదు. బహుశః కన్నతండ్రిగా మౌనం వహించారా? లేదా ఆమె రాజకీయాలు.. ఆమెతో పార్టీ ఏర్పాటు చేయించడం అన్నీ కూడా తన వ్యూహంలో భాగమే కనుక ఆమెకు నష్టం కలగకుండా మౌనం వహించారా? అనే సందేహం ఏర్పడేలా చేశారు ఈ సభతో!
బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ తాను సిఎం అవుతానని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అయితే ఎలా?అంటే సమాధానం ఆయనే చెప్పారు.
అదే.. “తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ.”
గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పదం వాడి కాంగ్రెస్, టీడీపి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను బీఆర్ఎస్ పార్టీలోకి లాగేసుకొని వాటిని రాజకీయంగా బలహీన పరిచారు.
కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే చాలా బలహీనంగా ఉంది. కనుక కేసీఆర్ చెప్పిన రాజకీయ శక్తుల పునరేకీకరణ అంటే కూతురు కవిత పార్టీలో విలీనమా లేక బిజేపిలో బీఆర్ఎస్ పార్టీ విలీనమా? అని అందరూ ఆలోచించేలా చేశారు.
వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకూడదంటే ఇదొక్కటే దారి. కనుక కేసీఆర్ ముందుగానే ప్లాన్ చేసి ఆమెని బయటకు పంపించి ఆమె చేత పార్టీ పెట్టిస్తున్నారా? ఇది తన వ్యూహంలో భాగమే కనుకనే ఆమె విషయంలో కేసీఆర్ మౌనం వహించారా? లేకుంటే మాట్లాడి ఉండేవారు కదా?
తెలంగాణ అభివృద్ధి కోసమే ఏప్రిల్ 25న కొత్త పార్టీ పెడుతున్నానని కల్వకుంట్ల కవిత చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో పలువురు సీనియర్లతో సహా ఆ పార్టీ కార్యకర్తలు కూడా తనతో టచ్‌లో ఉన్నారని కవిత పదేపదే చెప్పుకుంటున్నారు.
కనుక ఈ నెల 25న ఆమె కొత్త పార్టీ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె పార్టీలోకి వలసలు ప్రారంభం అయితే కేసీఆర్ చెప్పిన ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ తొలి విడత ప్రారంభం అయ్యిందనుకోవచ్చు.
ఇదివరకు కేసీఆర్ నోరు విప్పితే ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం వివక్ష అంటూ కత్తులు దూసేవారు. కానీ నిన్నటి సభలో బిజేపి, ప్రధాని మోడీని ఒక్క మాట అనకుండా ప్రసంగం మొత్తం రేవంత్ ప్రభుత్వానికి అంకితం చేశారు. ఎందువల్ల? అంటే రెండవ తుది విడత ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ కోసమేనా?
ఎన్నికలు దగ్గర పడినప్పుడు కవిత పార్టీ-బీఆర్ఎస్ పార్టీ-బిజేపిల తుది దశ రాజకీయ పునరేకీకరణ పూర్తవుతుందేమో?
బిజేపి, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు రేవంత్ రెడ్డే. అయన (కాంగ్రెస్ ప్రభుత్వం) పోవాలనే అందరూ కోరుకుంటున్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలనే చెపుతున్నారు.ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ‘డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని’ బిజేపి కూడా చెపుతోంది! రాజకీయాలలో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరనే రూల్ ఒకటి అమలులో ఉంది. కనుక ‘తెలంగాణ కోసం’ రాజకీయ శక్తుల పునరేకీకరణ అనివార్యంగానే కనిపిస్తోంది.




