ఢిల్లీ రాజకీయాలను శాసిస్తా, ప్రాంతీయవాదం నుంచి పార్టీని జాతీయవాదం దిశగా నడిపిస్తా అంటూ 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన ప్రసంగాలు బిఆర్ఎస్ నేతలను అమాంతం తెలంగాణ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు తీసుకెళ్లాయనే చెప్పాలి.
తీరా సీన్ కట్ చేస్తే బిఆర్ఎస్ ఢిల్లీ రాజకీయాలలో కాదు కదా తెలంగాణ గల్లీ రాజకీయాలలో కూడా ప్రజామోదం పొందలేకపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యింది. తెరాస నుంచి బిఆర్ఎస్ గా పార్టీ రూపాంతరం చెందే క్రమంలో వచ్చిన ఈ అనుకోని మార్పులతో నాటి నుంచి కూడా పార్టీ అధినేత కేసీఆర్ మౌన దీక్షలోకి వెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉండిపోయారు.
పార్టీ ఓటమి తరువాత పార్టీలో, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అనేక కీలక పరిణామాలలో సైతం కేసీఆర్ తన దీక్షను విరమించనేలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ వరకు ఏ ఒక్క అంశం మీద కూడా కేసీఆర్ గొంతు విప్పలేదు, తన వాదన వినిపించలేదు.
ఇక తాజాగా పార్లమెంట్ లో డీలిమిటేషన్ విషయం పై మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి ఆంధ్రప్రదేశ్ విభజన మీద తెలంగాణ ఏర్పాటు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు మీద తేజస్వి చేసిన హాట్ కామెంట్స్ తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కినా ఆ సెగ తెలంగాణ జాతిపితగా చెప్పబడే కేసీఆర్ ని ఆ మౌన దీక్షను కరిగించలేకపోయాయి.
తేజస్వి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు బీజేపీ పై విరుచుకుపడుతూ తేజస్వి సహా టి. బీజేపీ నేతలందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక బిఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి కేటీఆర్, హరీష్ లతో పాటుగా కవిత కూడా స్పందించారు.
అయితే తేజస్వి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం మొత్తం ముక్తకంఠంతో ఖండిస్తున్నా కేసీఆర్ మాత్రం తన మౌన దీక్షకు ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇటువంటి కీలకమైన విషయంలో కూడా కేసీఆర్ ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు.? ఆయన మౌనం వెనుక ఉన్న ఆ మర్మమేమిటి అంటూ అనేది బిఆర్ఎస్ శ్రేణులను కూడా కలవరపెడుతుంది.
ఇక ఈనెల 25 న కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 న జగిత్యాలలో జరగనున్న బిఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్న కేసీఆర్ తన కుమార్తె కవిత వేర్పాటు వాదం పై స్పందిస్తారా.? కవిత కొత్త రాజకీయ ప్రయాణం పట్ల బిఆర్ఎస్ శ్రేణులకు ఎలా ముందుకెళ్లాలని అనే అంశం మీద వారికీ దిశానిర్దేశం చేస్తారా.? అన్నది ఆసక్తిగా మారింది.




