ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కి నోటీస్!

KCR Phone Tapping Case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌కి సిట్ అధికారులు నేడు నోటీస్ ఇవ్వబోతున్నారు.

ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయం నుంచి సిట్ అధికారులు ఎర్రవల్లి ఫామ్‌హౌసుకు బయలుదేరి వెళ్ళారు. సిట్ అధికారులు ఆయనని ఫామ్‌హౌసులోనే రేపు ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

మరికొద్ది సేపటిలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్‌ పార్టీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితల ఖండనలు కూడా మొదలవుతాయి.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత కుటుంబ సభ్యులు, సొంత పార్టీ నేతలు, సొంత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా విపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలాగే న్యాయమూర్తులు, రియల్ ఎస్టేట్, బంగారం, వస్తార వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన కుమార్తె కవిత స్వయంగా తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని పదేపదే చెపుతున్నారు కూడా.

ఇప్పటికే ఈ కేసులో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వంటి నిందితులతో సహా కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీల నేతల వాంగ్మూలాలు సిట్ అధికారులు రికార్డ్ చేశారు. కనుక తర్వాత కల్వకుంట్ల కవితని పిలిచి ప్రశ్నిస్తారనుకుంటే నేరుగా కేసీఆర్‌ వద్దకు వెళ్ళిపోయారు.

ఫిభ్రవరి 11న తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్‌ కేసు పేరుతో హడావుడి చేస్తోందని కేటీఆర్‌, హరీష్‌ రావు ఆరోపిస్తున్నారు.

కానీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌కి నోటీసులు ఇస్తే దాంతో ప్రజలలో బీఆర్ఎస్‌ పార్టీకే సానుభూతి లభిస్తుంది తప్ప కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి కాదు. ఎందువల్లనంటే ఈ విచారణతో వారు దోషులని సిట్ ఇప్పటికిప్పుడు నిరూపించలేదు కనుక!

ఒకవేళ కోర్టులో నిరూపించాలన్నా ఈ కేసు విచారణ ఏళ్ళ తరబడి సాగుతూనే ఉంటాయి తప్ప ఎవరినీ దోషులుగా నిర్ధారించలేరు. ఎవరికీ శిక్షలు పడే అవకాశం కూడా ఉండదు.

కనుక మున్సిపల్ ఎన్నికల ముందు ఈ కేసు పేరుతో బీఆర్ఎస్‌ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వానికే నష్టం. బీఆర్ఎస్‌ పార్టీ లబ్ది పొందే అవకాశం ఉంటుంది.

కేసీఆర్‌ని ఓడగొట్టి ఫామ్‌హౌసులో కూర్చోబెట్టిన సిఎం రేవంత్ రెడ్డికి ఈవిషయం తెలియదనుకోలేము. కానీ ఆయన మనసులో మరేదో పెద్ద వ్యూహం ఉండి ఉండవచ్చు. అందుకే ఎన్నికల ముందు బీఆర్ఎస్‌ నేతలకి ముహూర్తం పెట్టారనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories