కేసీఆర్‌ విధానాలు ఫెయిల్ అని గ్రహించారా?

kcr-brs-

దాదాపు రెండు దశాబ్ధాలపాటు తెలంగాణ రాజకీయాలను కంటిసైగతో శాశించిన కేసీఆర్‌కి వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తన ఆలోచనలు, విధానాలపై అనుమానం ఏర్పడటం విశేషం.

శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే రెండు పార్టీలు ద్రవిడ సిద్దాంతాలతో దశాబ్ధాలుగా రాజకీయాలు చేస్తున్నాయి. మనం ఆ రెండు పార్టీల విధానాలను అధ్యయనం చేసి వాటిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి,” అని అన్నారు. కానీ ఆయన మాటలను అప్పుడు పార్టీ నేతలు, మీడియా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ADVERTISEMENT

నిజానికి కేసీఆర్‌ విరివిగా వాడుకునే ‘తెలంగాణ సెంటిమెంట్’ ఇంచుమించు అదేవిదంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమాలతో ‘తెలంగాణ సెంటిమెంట్’కి బలమైన పునాది వేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఆ పునాదులపైనే బిఆర్ఎస్ పార్టీని బలంగా నిర్మించుకున్నారు.

అయినప్పటికీ రేవంత్‌ రెడ్డి ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి, కేసీఆర్‌ని ఓడించి అధికారం చేజిక్కించుకోగలిగారు. కనుక తెలంగాణ సెంటిమెంట్‌తో ముందుకు సాగలేమని కేసీఆర్‌ భావించారో… గ్రహించారో ఏమో, మళ్ళీ తమిళనాడులో ‘ద్రవిడ పాలిటిక్స్’పై అధ్యయనం చేసేందుకు కొందరు సీనియర్ నేతలని చెన్నై పంపారు.

అయితే అలా చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కనుక తమిళనాడులో బీసీ రిజర్వేషన్స్ అమలవుతున్న విధానంపై అధ్యయనం చేసేందుకు అని చెప్పుకున్నారు. ఒకవేళ దాని కోసమే అయితే కేసీఆర్‌ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడే పంపించి ఉండవచ్చు. కానీ పంపలేదు. ఇప్పుడు ఆయన అధికారంలో లేరు కనుక పంపి నివేదిక తెప్పించుకున్నా ప్రయోజనం ఉండదు.

కనుక ద్రవిడ పార్టీలు పనిచేసే తీరు, వాటి విధానాలు, ప్రజలపై ఆ విధానాల ప్రభావం వగైరా అంశాలు అధ్యయనం చేసేందుకే పార్టీ నేతలను చెన్నైకి పంపించి ఉండవచ్చు. అంటే కేసీఆర్‌ తన విధానాలు సరికావని గ్రహించిన్నట్లే భావించవచ్చు.

కేసీఆర్‌ నాయకత్వలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క ఎన్నికలలో ఓడిపోగానే ఆ పార్టీ పతనావస్థకు చేరుకోగా, 1982లో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలుగా తీవ్రమైన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రాగలుగుతోంది. కనుక కేసీఆర్‌ టిడిపి, చంద్రబాబు నాయుడు పనితీరు, విధానాలను అధ్యయనం చేయవచ్చు. కానీ అందుకు కేసీఆర్‌కి అహం అడ్డొస్తోంది. అందుకే తమిళనాడు పార్టీలను ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటున్నారేమో?

ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ నేతలను చెన్నై పంపించడాన్ని తేలికగా కొట్టిపడేయలేము. కేసీఆర్‌ మరేదో పెద్ద ప్లాన్ సిద్దం చేసుకుంటున్నట్లే భావించవచ్చు.

కూతురు కవిత ఇంటికి వచ్చేసింది. యజ్ఞాలు యాగాలు పూర్తయిపోయాయి. త్వరలో విజయ దశమి. కనుక కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ బోనులో నుంచి ఆరోజు బయటకు రాబోతున్నారేమో?

ADVERTISEMENT
Latest Stories