ఏపీలో వైసీపీకి ఒకే ఒక బలమైన రాజకీయ ప్రత్యర్ధిగా టిడిపి నిలుస్తోంది. అగ్నికి వాయువు తోడైనట్లు దానికి జనసేన తోడవబోతోందని తెలిసినప్పటి నుంచి సిఎం జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఆయనకు మరో పెద్ద సవాల్ ఎదురవబోతోంది. అదీ…సమైఖ్య రాష్ట్ర చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుంచి!
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు రావడంతో ప్రస్తుతం ఆయన ఢిల్లీకి చేరుకొని ఇవాళ్ళ రాత్రి లేదా రేపు ఉదయం సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు.
ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానానికి 2024లో జరుగబోయే ఎన్నికలకు ఏవిదంగా సన్నద్ధం కావాలో ఇటీవల వివరించిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనని చెప్పినప్పటికీ వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ కోసం పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారు.
బహుశః ఆయన సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆయన అంగీకరిస్తే మొట్ట మొదట ఏపీలో చాలా బలంగా ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నించడం ఖాయం. అలాగే ఉండవల్లి, లగడపాటి వంటి హేమాహేమీలు కూడా మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో కాంగ్రెస్ ఏమాత్రం బలపడినా ఇంతకాలం వైసీపీ ఇమడలేక బయటకు వెళ్లలేక ఇబ్బందిగా గడుపుతున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన అసంతృప్త నేతలు, వారితో పాటు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళిన నేతలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టవచ్చు.
కనుక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకూడదని సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఆ ప్రభువును ప్రార్ధించడం మంచిది. కానీ ప్రభువు వారి ప్రార్ధనలను ఆలకించకపోతే వైసీపీ ప్రభుత్వానికి, పార్టీకి కూడా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి కొత్త తలనొప్పులు, కొత్త సవాళ్ళు తప్పవు.



