రాజకీయాలలో సీనియర్ మహిళా నేత గా పేరు తెచ్చుకున్న కొండా సురేఖ రేవంత్ సర్కార్ లో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మంత్రి గా కన్నా కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు సురేఖ. ఈ మధ్యకాలంలో నాగ చైతన్య, సమంతల వ్యక్తిగత విషయాల మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నే లేపాయి.
అయితే ఈ వివాదంలో పరువు నష్టం కేసులు, కోర్టులు అంటూ తగ్గేదెలా అన్నట్టుగా నాగార్జున కుటుంబం న్యాయపోరాటానికి సిద్దమయిన వేళ ఇప్పుడు తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు ఈ మహిళా మంత్రి గారు. ధర్మాపురంలో కొండా…రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ప్లెక్సి పంచాయితీలో భాగంగా కొండా వర్గీయులు ట్రాఫిక్ అంతరాయం సృష్టించడంతో వారి పై పోలీసులు కేసులు నమోదు చేసారు.
అయితే దీని మీద ఆగ్రహించిన సదరు మంత్రి గారు తమ అనుచరుల మీద కేసులా.? అంటూ గీసుకొండ పీఎస్ కు చేరుకొని అక్కడ సిఐ సీట్లో కూర్చుని పోలీసుల పైనే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాహ్య ప్రపంచం ముందుకొచ్చింది. దీనితో ఈ సారి కొండా సురేఖకు ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే మొన్న సమంత, నాగార్జున కుటుంబం పై చేసిన వ్యాఖ్యలకు అటు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుంటున్నట్టు ప్రకటించి సమంతకు క్షమాపణలు చెప్పారు మంత్రి గారు. ఇంకా ఆ వివాదానికి ఒక ముగింపు రానే లేదు ఇంతలో ఇప్పుడు సొంత పార్టీ నేతలతోనే వైరానికి సై అంటూ ఈ వివాదంలో ఇరుక్కున్నారు.
దీనితో ఒక బాధ్యతగల పదవిలో ఉంటూ చట్టాన్ని కాపాడవలసిన మంత్రులే ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద అందునా చట్టాలను రక్షించే పోలీసు అధికారుల మీద తమ అధికార జులుం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అంటూ సాధారణ ప్రజల నుంచి కూడా కొండా సురేఖ చర్యల మీద మరోసారి పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
మరి ఈ వివాదం మీద స్పందించి అందుకు తగ్గ వివరణ ఇచ్చి తానూ చేసిన ఈ దుస్సాహసానికి మరో సారి సారీ చెప్పడానికి కొండా సురేఖ సిద్ధమా..? ఇటువంటి చర్యలకు పాల్పడే మంత్రులను, రాజకీయ నాయకులను పార్టీ అధినేతలు కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అనే వాదన బలపడుతుంది.




