vijayawada-floods

కృష్ణానది ఒడ్డున విజయవాడ ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ నగరమే కృష్ణానది మద్యన ఉన్నట్లనిపించింది. కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన వర్షాలకు ఓ పక్క కృష్ణానది మరోపక్క బుడమేరు పొంగి ప్రవహించి విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లన్ని వరద నీరుతో పిల్ల కాలువల్లా మారగా సహాయ సిబ్బంది మరబోట్లు వేసుకొని తిరుగుతుంటే ఇది విజయవాడ నగరమేనా? అనిపించక మానదు.

Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?

సోమవారం మధ్యాహ్నం ప్రకాశం బ్యారేజీలో ఒక్కసారిగా 11.43 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో గేట్లన్నీ ఎత్తి విడుదల చేయక తప్పలేదు. దాంతో రామలింగేశ్వర్ నగర్, కృష్ణలంక, సింగ్‌ నగర్, భవానీపురం, యనమలకుదురు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

ముందు బుడమేరుకి వరద వచ్చింది. ఆ తర్వాత కృష్ణానది ఉప్పొంగి ప్రవహించింది. ఒకదాని తర్వాత మరొకటి ఉప్పొంగి ప్రవహించడంతో జలప్రళయం వచ్చిన్నట్లే అనిపించింది. విజయవాడలోని సింగ్‌ నగర్‌లో నడుంలోతు నీళ్ళు ముంచెత్తడంతో సహాయ సిబ్బంది బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

సిఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి నుంచే జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మకాం వేసి సహాయ చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతీ ఒక్కరికీ వేరువేరుగా బాధ్యతలు అప్పగించి నిరంతరంగా సహాయపునరావాస చర్యలు కొనసాగేలా చేశారు. టిడిపి, జనసేనల తరపున నేతలు, కార్యకర్తలు కూడా యధాశక్తిన ప్రజలకు ఆహారం, మంచినీళ్ళు, కూరగాయలు వగైరా అందించారు.

సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కొన్ని చోట్ల బోట్‌లో, కొన్ని చోట్ల బుల్ డోజర్‌లో పర్యటించారు. మోకాలు లోతు నీటిలో నడుస్తూ బాధితుల వద్దకు చేరుకొని వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ అధైర్యపడవద్దని ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. సహాయ, పునరావాస చర్యలను మరింత సమర్ధంగా, వేగవంతంగా చేపట్టేందుకు విజయవాడలో ఒక్కో డివిజన్‌కి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు.

Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?


సోమవారం ఒక్కరోజే విజయవాడలో అక్షయపాత్ర, హోటల్స్ అసోసియేషన్లు కలిసి రెండు లక్షల మందికి ఆహారం అందించాయి. వివిద శాఖల సహాయ సిబ్బంది బోట్లలో ఇంటింటికీ వెళ్ళి నీళ్ళు, నిత్యావసర సరుకులు అందించారు. కొన్నిచోట్ల డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. వరద ఉదృతి తగ్గి నగరంలో నుంచి పూర్తిగా నీరు వెనక్కు వెళ్ళేవరకు సహాయచర్యలు కొనసాగిస్తూనే ఉండాలని సిఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులని ఆదేశించారు.