లోక్ సభ ఎన్నికలలో ఓటమి తర్వాత బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏ ఉద్దేశ్యం లేదా కారణాలతో ఫామ్ హౌసులో ఉండిపోయారో కానీ ఆయన లేకపోయినా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ పార్టీని చాలా చక్కగానే నడిపిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా ధీటుగానే ఎదుర్కొంటున్నారు.
ఇందుకు మరో నిదర్శనంగా ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున ‘దీక్షా దివస్’ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దీని కోసం జిల్లాలవారీగా పార్టీ ముఖ్య నేతలను ఇన్ ఛార్జీలను కూడా నియమించారు.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ఉద్యమాలను మలుపు తిప్పారు. ఉద్యమాలు ఉదృతం అవడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర విభజన కోసం పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేసింది. కనుక తెలంగాణ ఏర్పడి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘దీక్షా దివస్’ జరుపుకుంటోంది.
అయితే దీనిలో కొత్త విషయం ఏముందని చాలా మంది భావించవచ్చు. కానీ ఈసారి ‘దీక్షా దివస్’కు చాలా ప్రాధాన్యత ఉంది.
Also Read – జగన్ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ‘సోనియా గాంధీ దయతలిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని కనుక ఆమెకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని బలంగా వాదించి దాంతో ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చారు.
ఇప్పుడు వారే అధికారంలో ఉండటంతో తెలంగాణ అంటే సోనియా, ఇందిరమ్మ రాజ్యం అన్నట్లు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
అందుకే డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజునాడే సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు.
కనుక తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ మాయలో పడి కేసీఆర్ పోరాటాలను, త్యాగాలను మరిచిపోకుండా ఉంచేందుకు, అలాగే ఢీలా పడిన పార్టీ శ్రేణులలో మళ్ళీ నూతనోత్సాహం నింపేందుకు ‘దీక్షా దివస్’ వంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి ఆలోచనే.
ముఖ్యంగా సోనియా వల్లనే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్న ఈ తరుణంలో ‘ఆమె వల్ల కాదు కేసీఆర్ వలననే వచ్చిందని’ నొక్కి చెప్పుకోవడం బిఆర్ఎస్ పార్టీ మనుగడకి చాలా అవసరం. కనుక కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ గులాబీ కారు బాగానే డ్రైవింగ్ చేస్తున్నారని భావించవచ్చు.