బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేయడంతో ఊహించిన్నట్లే కల్వకుంట్ల కవిత నిరపరాదని రుజువు అయ్యిందని, న్యాయం, ధర్మం గెలిచిందని కేటీఆర్, హరీష్ రావు తదితర బిఆర్ఎస్ పార్టీ నేతలు చెపుతున్నారు.
రేపు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్న తర్వాత బహుశః కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి, ‘నేను మొదటి నుంచి నా కుమార్తె ఎటువంటి తప్పూ చేయలేదనే చెపుతూనే ఉన్నాను. చివరికి అదే నిజమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పిందని” చెప్పినా ఆశ్చర్యం లేదు.
కవితకి బెయిల్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల స్పందన కూడా ఊహించిన్నట్లే ఉంది. కవితని జైలు నుంచి విడిపించుకోవడం కోసం బీజేపీతో బిఆర్ఎస్ పార్టీ రహస్య అవగాహన కుదుర్చుకుందని తాము చెపుతూనే ఉన్నామని, ఇప్పుడు అదే జరిగిందని త్వరలో బీజేపీలో బిఆర్ఎస్ విలీనమో, రెండు పార్టీల మద్య పొత్తులో జరుగబోతున్నాయని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
అయితే కవిత బెయిల్‌పై తెలంగాణ బీజేపీ నేతలు ఎవరూ స్పందించడం లేదు. వారి మౌనం కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నట్లుంది. ఆ ఆరోపణలు నిజమవుతాయో లేదో త్వరలో తెలుస్తుంది.
కల్వకుంట్ల కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది తప్ప నిరాపరాధి అని సర్టిఫై చేయలేదు. కానీ వర్తమాన రాజకీయాలలో బెయిల్ లభించడాన్నే ‘క్లీన్ సర్టిఫికేట్’గా పరిగణిస్తున్నారు కనుక కవితకి కూడా అదే వర్తింపజేసుకుంటున్నారని సరిపెట్టుకోవలసిందే.
ఒకవేళ కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల మద్య డీల్ కుదిరితే, ఈ కేసు అటకెక్కుతుంది లేదా జగన్ అక్రమాస్తుల కేసుల్లాగే ఏళ్ళ తరబడి సాగుతూ ఉంటుంది. కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమె మళ్ళీ రాజకీయాలు చేసుకోవచ్చు.
ఒకవేళ బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల డీల్ కుదరకపోయినా లేదా మళ్ళీ మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ చెలరేగిపోయినా ఈ కేసులో ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ మళ్ళీ జైలుకి వెళ్ళిన్నట్లే, ఆమె కూడా మళ్ళీ తిహార్ జైలుకి బయలుదేరక తప్పదు.
కానీ కేసీఆర్ మళ్ళీ అటువంటి పొరపాటు చేయరనే భావించవచ్చు. కనుక బిఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ రాజకీయాలలో కల్వకుంట్ల కవిత ఎప్పటికీ ఆణిముత్యంగానే నిలిచిపోతారు.




