మంగళవారం జూబ్లీహిల్స్ పోలింగ్ జరిగే వరకు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే తమ గెలుపు ఖాయమని, ఎంత మెజార్టీ అనేది మాత్రమే తేలాల్సి ఉందని చెప్పేవారు. పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత కూడా అలాగే చెప్పేవారు.
కానీ పోలింగ్ పూర్తయ్యేసరికి ఆమె, బీఆర్ఎస్ పార్టీ కూడా భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించడం మొదలుపెట్టారు. అంటే ఫలితాలు వెలువడక మునుపే ఓటమి అంగీకరించేశారనుకోవచ్చు.
అధికార పార్టీయే రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తున్నప్పుడు, ఈ మాటకే కట్టుబడి ఉంటే ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ రిగ్గింగ్ చేయడం వల్లనే ఓడిపోయామని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి వీలు ఉండేది.
కానీ ఈరోజు సోషల్ మీడియాలో “జూబ్లీహిల్స్‌లో కారు దూసుకుపోయింది… బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతోంది…” అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది.
అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత రిగ్గింగ్ చేసినా బీఆర్ఎస్ పార్టీయే తప్పక గెలుస్తుందనా? లేదా బీఆర్ఎస్ పార్టీయే రిగ్గింగ్ చేసి గెలిచిందనుకోవాలా? లేదా రిగ్గింగ్ అబద్దమనుకోవాలా?అనే సందేహం కలుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ ఈ ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా మార్చేయడం ఇంతగా ఎదురీదవలసి వచ్చిందని, ఒకవేళ ఓడిపోతే ఈవిదంగా ప్రతిష్టాత్మకంగా మార్చుకొని పెద్ద పొరపాటు చేసిందని చెప్పక తప్పదు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలవోకగా ఇలాంటి ఉప ఎన్నికలలో గెలుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే ధీమాతో దూకుడుగా వ్యవహరించి, ఓడిపోతే ఇన్ని ప్రగల్భాలు పలికిన కేటీఆరే నవ్వుల పాలవుతారు కదా?
ఇలాంటి అప్రదిష్ట తన మెడకు చుట్టుకుంటుందనే భయంతోనే బహుశః కేసీఆర్ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండి ఉంటారు. కనుక కేటీఆర్ కూడా ఈ బాధ్యతను పార్టీలో సీనియర్లకు అప్పగించి తాను తెర వెనక నుంచి అన్నీ చక్కబెట్టుకుంటే సరిపోయేది.
కానీ భారీ మెజార్టీతో గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికి చాలా హడావుడి చేశారు. తద్వారా ఓడితే ఈ ఓటమి అందరికీ భూతద్దంలో నుంచి చూసినట్లు మరింత పెద్దదిగా కనిపిస్తుంది.
నాడు హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా ఈటల రాజేందర్‌ని ఓడించి రాజకీయ సమాధి చేయాలని కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. కానీ ఈటల రాజేందర్ గెలిచారు. దాంతో బీఆర్ఎస్ అభ్యర్ధి కాక కేసీఆర్ ఆ ఉప ఎన్నికలో ఓడిపోయారనే భావన ప్రజలకు ఏర్పడింది. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇప్పుడూ అందరూ అలాగే భావించకుండా ఉంటారా?






