కేటీఆర్ సంజాయిషీలు…కవిత సెటైర్లు…!

KTR and Kavitha in contrasting stands as BRS faces Jubilee Hills bypoll pressure

తెలంగాణలో పదేళ్లు ప్రతిపక్షమన్నదే లేకుండా ఏకచక్రాధిపత్యం సాగించిన బిఆర్ఎస్ ఇప్పుడు కేవలం ఒక ఉప ఎన్నికల కోసం అందునా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం గెలుపు కోసం చెమటలు కక్కుతోంది, ఓటమి భయంతో కంగారు పడుతుంది.

అలాగే గతంలో చేసిన పొరపాట్లకు సంజాయిషీలు ఇస్తూ ఓటర్లను తిరిగి గులాబీ కారు వైపుకి ఆకర్షించేందుకు శ్రమిస్తోంది. నాడు బాబు అరెస్టు నేపథ్యంలో కేటీఆర్ పెట్టిన సోషల్ మీడియా పోస్టుల పై నేడు మరోసారి వివరణ ఇచ్చేందుకు, తన వాదనలో నిజం ఉందని నమ్మించేందుకు కేటీఆర్ తెగ ఆరాటపడుతున్నారు.

ADVERTISEMENT

అయితే బాబు అరెస్టు విషయం తనకు తెలియదని, తానూ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హేళన చేసేందుకు పోస్టులు చెయ్యలేదని, అటువంటి ఉద్దేశాలు తనకు లేవంటూ టీడీపీ మద్దతుదారులని శాంతిపచేసే పనిలో పడ్డారు కేటీఆర్. మరి కేటీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలు బిఆర్ఎస్ కు ఏ మేరకు సానుకూల ఫలితాలను అందిస్తాయన్నది మరొకొన్ని రోజులల్లో తెలియనుంది.

అయితే బిఆర్ఎస్ గెలుపు కోసం కేటీఆర్ చెపుతున్న ప్రత్యక్ష సంజాయిషీలు ఇలా ఉంటే మరోపక్క బిఆర్ఎస్ ఓటమి కోసం కవిత వేస్తున్న పరోక్ష సెటైర్లు మరోలా ఉన్నాయి. అధికారం మాకే శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంటికే పరిమితం చేసారు అంటూ కవిత చేసిన ప్రకటనలు పరోక్షంగా బిఆర్ఎస్ ను కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నాయి.

ఈ ఉపఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపు కేసీఆర్ ఉనికికి నిదర్శనం కాగా ఈ గెలుపు కేటీఆర్ నాయకత్వ లక్షణాలకు ప్రతీక కానుంది. ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడితే ఇక నుంచి బిఆర్ఎస్ కి కాంగ్రెస్, బీజేపీ లతో పాటు కవిత కూడా మరో రాజకీయ ప్రత్యర్థిగా మారబోతున్నారు.

కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించను అంటు నాడు కవిత చేసిన విమర్శలకు నేడు గులాబీ ఓటమి ని సాక్ష్యంగా చూపించే అవకాశం లేకపోలేదు. అలాగే కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటకుండా పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలని భావించడం పార్టీ ఓటమిని నిర్దేశిస్తుంది అంటూ కవిత తన గళాన్ని మరింత బలంగా విప్పే ప్రమాదం ఉంది.

ఇలా ఒకపక్క కేటీఆర్ సంజాయిషులు బిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తుంటే…మరోపక్క కవిత సెటైర్లు బిఆర్ఎస్ ఓటమి కోసం ఎదురుచూస్తున్నాయి. మరి జూబ్లీహిల్స్ ఓటర్లు సంజాయిషిలకు శాంతిస్తారా.? లేక సెటైర్లకు సంతోష పడతారా.?

ADVERTISEMENT
Latest Stories