రాజకీయాలలో ఉన్నవారు పార్టీలకు అతీతంగా అభినందనలు, శుభాకాంక్షలు చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిద పార్టీల నేతలు ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు.
కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న కేసీఆర్, కేటీఆర్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. అసలు ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న విషయమే తెలియనట్లు ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆనాడు జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పుడు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లుగా కేసీఆర్, కేటీఆర్ మౌనంగా ఉండిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు ఆందోళన చేస్తే వారిపై కేటీఆర్ రంకెలు వేశారు.
అది కూడా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ఓ కారణమని నేటికీ గ్రహించిన్నట్లు లేదు. కానీ ఆ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకూడదనే చంద్రబాబు నాయుడు నిర్ణయం వలననే తాము ఓడిపోయామని గ్రహించిన్నట్లే ఉన్నారు. బహుశః అందుకే ఇప్పుడు పట్టన్నట్లు ఉండిపోయారనుకోవచ్చు.
అయినా కేంద్రంలో చక్రం తిప్పుతానని, ప్రధాన మంత్రి పదవి చేపట్టి దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తెస్తానంటూ ప్రగల్భాలు పలికి చివరికి సొంత రాష్ట్రంలో వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయి ఏడుస్తున్న సమయంలోనే ఇటు ఏపీ రాష్ట్ర స్థాయిలో, అటు జాతీయ స్థాయిలో మళ్ళీ ప్రాధాన్యం సంపాదించుకున్న తమ శత్రువు చంద్రబాబు నాయుడుని అభినందించాలంటే విశాల హృదయం ఉండాలి కదా?
అయితే ఇప్పటికైనా కేసీఆర్ అకారణంగా అందరినీ ద్వేషిస్తూ శత్రువులుగా మార్చుకునే తన ధోరణి సరికాదని, ఇటువంటి ధోరణి వల్లనే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు నష్టపోయాయని గ్రహిస్తే మంచిది. అలాగే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లాగా భేషజాలను పక్కనపెట్టి అందరినీ కలుపుకుపోవాలని గ్రహిస్తే ఇంకా మంచిది.




