అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ళ బాలికపై హత్యాచారం చేసిన కులవర్ధన్ (30) జిల్లాలోని కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు!
అభం శుభం తెలీని చిన్నారిపై అత్యాచారం చేయడమే కాక హత్య చేసి ఇంట్లో నీళ్ళ డ్రమ్ములో బాలిక శవాన్ని కుక్కి హాయిగా నిద్రపోయాడు. అతనే హంతకుడని తెలుసుకున్న ప్రజలు అతనిని పట్టుకొని చంపేసేందుకు సిద్ధమయ్యారు. కానీ అతను పరారయ్యాడు.
అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. కానీ అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అతనిపై ఆగ్రహంతో ఉన్నవారే హత్య చేసి చెరువులో పడేశారా? అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
అయితే అతను అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డాడు కనుక అనుమానస్పద మృతికేసుగా మూసివేసే అవకాశం ఉంది.
రోడ్ ప్రమాదాలలో తరచూ చిన్నారులు చనిపోతూనే ఉన్నారు. కానీ ఇలాంటి ఘటనలు చూస్తున్నప్పుడు మన సమాజంలో చిన్నారులకు ఇంటి గడప దాటితే భద్రత ఉందా?అనే సందేహం కలుగుతుంది.
అభం శుభం తెలీని చిన్నారుల పరిస్థితే ఈవిధంగా ఉంటే స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లి వచ్చే టీనేజ్ ఆడపిల్లలకు, ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకునే యువతుల పరిస్థితి ఏమిటి?
వారు ఇలాంటి దుర్మార్గుల చేతిలో చిక్కుకోకుండా ప్రభుత్వం, పోలీసులు కొత్త ఆలోచనలు చేయాల్సి ఉంది. ఏఐ, డ్రోన్ టెక్నాలజీని ప్రభుత్వం విరివిగా వాడుతున్నందున దానిని వినియోగించుకుని బాలికలు, మహిళలు భద్రతకు ప్రత్యేక టీమ్స్, ప్రత్యేక చర్యలు తీసుకోగలిగితే మంచిది.







