కోటా శ్రీనివాసరావు ఇక లేరు

Kota Srinivas Rao Passed Away

ప్రముఖ తెలుగు సినీ నటుడు కోటా శ్రీనివాస రావు (83) కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

కోటా శ్రీనివాసరావు 1942, జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. సినిమాలలోకి రాక ముందు కొంతకాలం స్టేట్ బ్యాంకులో పనిచేస్తూ నాటక ప్రదర్శనలు ఇచ్చారు.

ADVERTISEMENT

1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత మరి తిరిగి చూసుకోలేదు. ఈ నాలుగు దశాబ్ధాలలో ఆయన 750కి పైగా సినిమాలలో నటించారు.

వందే మాతరం, ప్రతిఘటన, తాండ్ర పాపారాయుడు, రేపటి పౌరులు, ఆహా నా పెళ్ళంట, దయామయుడు, ఖైదీ నంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, బొమ్మరిల్లు, అతడు, రేసు గుర్రం వంటి అనేక హిట్ సినిమాలలో విభిన్నమైన పాత్రలకు తన నటనతో ప్రాణం పోశారు. జంద్యాల దర్శకత్వంలో చేసిన ‘ఆహా నా పెళ్ళంట’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడుగా మారిపోయారు.

కోటా శ్రీనివాసరావు 8 నంది అవార్డులు, సైమా అవార్డు, 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

కోటా శ్రీనివాసరావు విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1999-2004వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.

కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణీ ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు కోట ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ ప్రముఖులు కోటా శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో అనేక సినిమాలు చేసిన బ్రహ్మానందం, బాబు మోహన్ ఆయన మరణవార్త విని కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈ రోజు మరికొద్ది సేపటిలో ఫిల్మ్ నగర్‌ మహాప్రస్థానంలో కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు జరుగనున్నాయి.

ADVERTISEMENT
Latest Stories