ఓ పరిశ్రమ లేదా వాణిజ్య సంస్థ లేదా ఐటీ కంపెనీలు ని రాష్ట్రానికి తెచ్చుకోవడానికి ప్రభుత్వం ఎంతగానో శ్రమపడాలి. ఎన్నో రాయితీలు ఇవ్వాలి. రాష్ట్రంలో వ్యాపార అనుకూలమైన పరిస్థితి, సానుకూల రాజకీయ వాతావరణం ఉందని వాటికి నమ్మకం కలిగించాలి.
ఇవన్నీ సరిగ్గా అమరితేనే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఐటీ కంపెనీలు వస్తాయి. ఇంత శ్రమపడి తెచ్చుకున్న తర్వాత కూడా వాటికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉండాలి. అప్పుడే ఏ సంస్థలైన రాష్ట్రంలో నిలబడతాయి. వాటి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంటుంది.
రాష్ట్ర విభజన తర్వాత చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి ఏ పెట్టుబడిదారు రాష్ట్రానికి రావాలనుకోడు. కానీ చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇమేజ్, ఆయనపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకం కారణంగా హైపర్ మార్కెటింగ్ షాపింగ్ మాల్స్ రంగంలో అంతర్జాతీయస్థాయిలో పేరు మోసిన లులు గ్రూప్ భారీ పెట్టుబడితో హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
దానికి చంద్రబాబు నాయుడు విశాఖ బీచ్ రోడ్డులో భూమి కేటాయించారు. అయితే ఆ తర్వాత జగన్ అధికారంలోకి రాగానే, దానికి కొర్రీలు వేసి అనుమతులు రద్దు చేయడంతో ఆ సంస్థ వెనక్కు వెళ్ళిపోయింది.
సుమారు 2-3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగల అటువంటి వాణిజ్య సంస్థని ఏ ప్రభుత్వమైనా కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకుంటుంది. కానీ జగన్ తరిమేశారు. చంద్రబాబు నాయుడుపై పగ, ద్వేషం, కక్షతో రగిలిపోతున్న జగన్ ఆయన నిర్మించిన ప్రజావేదికని కూల్చేసి, అన్నా క్యాంటీన్లు మూయించివేసినప్పుడు, ఆయన అనుమతులు మంజూరు చేసిన లులు గ్రూప్‌ని కొనసాగనిస్తారా?అందుకే తరిమేశారు.
ఓ విదేశీ వాణిజ్య సంస్థ మరో దేశంలో.. ఓ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చి ఇటువంటి పరాభవం, చేదు అనుభవం ఎదుర్కొన్నాక మళ్ళీ ఎన్నడూ తిరిగి రావాలనుకోదు.
కొత్త సంస్థలను రప్పించడమే ఎంతో కష్టమనుకుంటే, తిరిగి వెళ్ళిపోయిన సంస్థని రప్పించడం మామూలు విషయం కానే కాదు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ గ్రూప్ సంస్థల అధినేత యూసఫ్ అలీతో మాట్లాడి, నచ్చజెప్పి ఒప్పించగలిగారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన సంసిద్దత వ్యక్తం చేశారు.
కనుక మళ్ళీ లులు గ్రూప్‌కి విశాఖ ఆర్‌కే బీచ్ రోడ్డు సమీపంలో ఉన్న హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను కేటాయించేందుకు వీలుగా ఆ భూమిని ఏపీఐసీసీ (ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ)కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం వీఎంఆర్‌డీయేకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రక్రియ అంతా ఒకటి రెండు నెలల్లో ముగిస్తే, అక్కడ లులు గ్రూప్ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడితో భారీ హైపర్ షాపింగ్ మార్కెట్ (మాల్) నిర్మిస్తుంది.
లులు గ్రూప్ సాధారణంగా స్థానిక రైతులు, స్థానిక పరిశ్రమలలో ఉత్పత్తి అయినవాటిని విక్రయించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కనుక దీంతో చుట్టుపక్కల జిల్లాలలో రైతులు, పాడి రైతులు, కుటీర, చిన్న తరహా, మద్య తరహా పరిశ్రమలకు చాలా మేలు కలుగుతుంది.
ఈ ఒక్క సంస్థ విషయంలో జగన్, చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు గమనిస్తే, ఇద్దరి ఆలోచనా దృక్పధంలో ఎంత తేడా ఉందో అర్దమవుతుంది. జగన్‌ది విధ్వంస విధానం కాగా, చంద్రబాబు నాయుడుది బంగారు భవిష్యత్‌కి బాటలు వేసే నిర్మాణాత్మకమైన విధానమని స్పష్టమవుతోంది కదా?




