ఈరోజు జనసేన నేతలు, కార్యకర్తలు మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు ధర్నా చేశారు. పేర్ని నాని తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడారని, అందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయం తెలుసుకొని పేర్ని నాని, కిట్టూ అనుచరులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాలు నినాదాలు చేస్తూ, పరస్పరం దూషించుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించేశారు.
ఇది చాలా సాధారణ వార్తే. అయితే అధికారంలో ఉన్నపుడు చేసే చిన్నా, పెద్దా తప్పులకు అధికారం కోల్పోయిన తర్వాత ప్రాయశ్చిత్తం జరిపించే రోజులివని ఎవరూ మరిచిపోకూడదు.
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి జోగి రమేష్ తదితరులు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ప్రయత్నించినందుకు, ఇప్పుడు వారందరిపై కేసులు నమోదు చేశారు. వారిలో కొందరు జైలులో ఉన్నారిప్పుడు.
పేర్ని నాని తమ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి చులకనగా ఏదో అన్నారని ఇప్పుడు ఆవేశపడుతున్న జనసేన నేతలు, కార్యకర్తలు గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు వంటివారు పవన్ కళ్యాణ్‌ని అంతగా అవహేళన చేస్తున్నప్పుడు ఎందుకు ఆవేశపడలేదు?అప్పుడు ఈవిదంగా వారి ఇళ్ళ ముందు ఎందుకు ధర్నాలు చేయలేదు? అని ఆలోచిస్తే అప్పుడు అధికారంలో లేమనే సృహ, ఇప్పుడు అధికారంలో ఉన్నామనే గర్వం వల్లనే అని అర్దమవుతుంది.
కనుక టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పుడు ఈవిదంగా వ్యవహరించి భవిష్యత్‌లో సమస్యలు సృష్టించుకోకుండా ఉంటే మంచిది. అంటే వైసీపి మళ్ళీ అధికారంలోకి వస్తుందనా?అనే ఎదురు ప్రశ్న ఈ సమస్యకు పరిష్కారం కాదు.
కానీ ఒకవేళ వస్తే పర్యవసానాలు ఈవిదంగా ఉంటాయని హెచ్చరిక మాత్రమే. కనుక టిడిపి, జనసేనలు మరింత బాధ్యతగా సంయమనంతో వ్యవహరించడం చాలా అవసరం.






