గాలి జనార్ధన్ రెడ్డి తనయురాలి వివాహ మహోత్సవానికి సంబంధించిన శుభలేఖ చూసి అంతా నోరెళ్ళబెట్టిన వైనం తెలిసిందే. పిలుపుల కోసమే కొన్ని కోట్లు ఖర్చుపెట్టిన గాలి ఇంట వివాహం దేశమంతా హాట్ టాపిక్ అయ్యింది. ఈ వేడుకలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, అందాల బొమ్మ కత్రీనా కైఫ్ ల డ్యాన్స్ ల కార్యక్రమం కూడా ఉందని ప్రచారంలో ఉండగా, ఇది కాక ఇంకా చాలా మంది ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేయనున్నారని, వారి కోసం ప్రత్యేక రైళ్ళు, ఫ్లైట్స్ ను కూడా గాలి సిద్ధం చేస్తున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక, మన టాలీవుడ్ నుండి ప్రస్తుత స్టార్ హీరోలంతా కూడా క్యూ కడుతున్నారని మరో టాక్. ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు ‘బాహుబలి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా హాజరు కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గాలి సన్నిహిత వర్గాలు మీడియా వర్గాలకు అందించిన సమాచారం మేరకు ఈ వివరాలు బయటకు లీక్ అయ్యాయని, వీరితో ప్రముఖ దర్శక నిర్మాతలు, ముందుతరం స్టార్ హీరోలు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాలకతీతంగా అందరినీ ఈ వేడుకకు గాలి ఆహ్వనించినట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే, గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సాయి కుమార్ టాలీవుడ్, కోలీవుడ్ ఆహ్వానాలలో చక్రం తిప్పుతున్నట్లుగా, ఒక విధంగా గాలి కూతురి వివాహం ఇంత అట్టహాసంగా జరగడం వెనుక సాయికుమార్ ప్లానింగ్ ఉన్నట్లుగా మీడియా వర్గాలలో హల్చల్ చేస్తోన్న మరో టాక్. ఇప్పటివరకు హల్చల్ చేస్తోన్న సమాచారం ప్రకారం… ఓ రెండు నుండి మూడు వందల కోట్లు ఈ వివాహానికి ఖర్చు చేస్తున్నట్లుగా టాక్. అయితే ఈ మొత్తం రెట్టింపు అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని కూడా అంటున్నారు.



