కుల రాజకీయాలు లేవన్న తెలంగాణలో కులసభలు!

malla reddy caste politics    తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్, ఆ తరువాత హిందూ-ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ కులాల ప్రస్తావన తక్కువే అని చెప్పవచ్చు. అయితే టిఆర్ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలను కులాల వారీగా విడదీసి వారికి సామాజిక భవనాలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా కుల రాజకీయాలు మొదలయ్యాయి.

అందుకు తాజా నిదర్శనంగా ఆదివారం హైదరాబాద్‌ శివార్లలో ఘాట్‌కేసర్‌ వద్ద జరిగిన రెడ్డి సింహ గర్జన సభ గురించి చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో తమ రాజకీయ శక్తిని, సమైక్యతను చాటి చెప్పేందుకు ఆ సభకు వేలాదిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు తరలి వచ్చారు. ఆ సభకు తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు.

ADVERTISEMENT

సభ ప్రారంభమైనప్పుడు తొలుత కొందరు పెద్దలు మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం వంటి అంశాల గురించి మంత్రి ఎదుటే ప్రస్తావించి జవాబు ఆశించారు. ముఖ్యంగా రూ.5,000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, రెడ్లలో నిరుపేదలకు విదేశీ విద్యాభ్యాసం కోసం నిధుల కేటాయింపు గురించి వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.

వారి తరువాత మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి వాటి గురించి మాట్లాడకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పధకాలు, రైతు బంధు, దళిత బంధు, హరితహారం తదితర పధకాల గురించి మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌ గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు.

దాంతో సభకు వచ్చినవారిలో అసహనం మొదలైంది. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగానే వారు లేచి నిలబడి “ఇక చాలు…ఇక చాలు..మల్లారెడ్డి డౌన్‌ డౌన్‌… గోబ్యాక్…” అంటూ నినాదాలు చేయడంతో ఆయన షాక్ అయ్యారు. ప్రసంగం మద్యలో ఆపేసి కారులో వెళుతుండగా, కొంతమంది ఆయన కాన్వాయ్ వెంటపడి దానిపై చెప్పులు, కుర్చీలు విసిరారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొని మంత్రి కాన్వాయ్‌కి దారి కల్పించడంతో ఆయన అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

కొంత కాలం క్రితం తెలంగాణలో వెలమ, యాదవ కుల సభలు కూడా జరిగాయి. అంటే తెలంగాణలో కూడా కుల రాజకీయాలు మొదలయ్యాయని, ఎన్నికలలో వాటి ప్రభావం ఉంటుందని స్పష్టం అవుతోంది. అధికారంలో ఉన్నవారు ప్రజలను కులమతాల వారీగా విడదీసి సంక్షేమ పధకాల పప్పు బెల్లాలు పంచి ఓట్లు దండుకోవాలని ఆశిస్తే,

చివరికి కులసంఘాలు ఈవిదంగా వారినే నిలదీసి తరిమికొడుతుండటం గమనిస్తే ప్రజలను విడదీయడం, పప్పు బెల్లాలు పంచడం రెండూ తప్పే అని స్పష్టం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories