రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. కనుక ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దాని లక్ష్యం ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధే అయ్యుండాలి. మొదటి 5 ఏళ్ళలో సిఎం చంద్రబాబు నాయుడు ఆ దిశలో కొన్ని అడుగులు వేశారు.
కానీ తర్వాత దానిని కొనసాగించాల్సిన జగన్ సంక్షేమ పధకాల బాట పట్టడంతో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ కృషి వృధా అయిపోయింది. కనుక ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సివస్తోంది. అయితే ఈ విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలస్యం చేయదలచుకోలేదు.
దుబాయ్‌కి చెందిన ‘లూలూ గ్రూప్ ఇంటెర్నేషనల్’ త్వరలోనే రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టి హైపర్ మార్కెట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను ఏర్పాటు చేయబోతోంది.
మరోపక్క మంత్రి నారా లోకేష్ కూడా ఈ దిశలో అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం-సీఐఐ భాగస్వామ్యంలో ఓ కన్సల్తేటివ్ ఫోరంని ఏర్పాటు చేశారు. దానికి ఆయనే ఛైర్మన్‌గా ఉంటారు.
దీనిలో ఆర్ధిక, రెవెన్యూ, పరిశ్రమలు తదితర శాఖల అధికారులు, సీఐఐ తరపు సభ్యులు ఉంటారు. వీరు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకి అవసరమైన విధానాలు రూపొందిస్తారు. రాష్ట్రంలో ఆయా జిల్లాలలో లభించే సహజ వనరులు, మానవ వనరులు, వ్యాపార అవకాశాలను గుర్తించి ఆ వివరాలను పెట్టుబడిదారులతో పంచుకుంటారు.
పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వానికి పెట్టుబడిదారులకు మద్య వారధిగా పనిచేస్తారు. రెండేళ్ళ కాలపరిమితితో ఈ ఫోరం పనిచేస్తుందని పరిశ్రమల శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులలో పేర్కొంది.
ఒక పరిశ్రమ లేదా ఓ ఐటి కంపెనీ లేదా ఓ వాణిజ్య సంస్థ ఏర్పాటు కావాలంటే ఇరువైపుల నుంచి చాలా కృషి, నిబద్దత అవసరం. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి చేతులు దులుపుకుంటే సరిపోదు. రాష్ట్రంలో రాజకీయ సుస్తిరత, ప్రభుత్వానికి సరైన విధానాలు కూడా చాలా అవసరం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అటువంటి చక్కటి వాతావరణమే ఏర్పడింది. ఈ ఫోరం ఏర్పాటు కూడా ఆ దిశలో చేస్తున్న ఓ మంచి ప్రయత్నమే. కనుక ఈసారి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.




