” తెలంగాణలో కేటీఆర్-మంత్రి కొండా సురేఖల మద్య జరిగిన యుద్ధంలో ఆమె బాణం గురి తప్పి అక్కినేని కుటుంబానికి గుచ్చుకుంది. ఆ తర్వాత జరిగిన కధ అందరికీ తెలుసు కనుక ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అవసరం లేదు.
ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు ఆమెపై విరుచుకుపడుతున్నప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ‘ఇక్కడితో ఈ వివాదం ముగిద్దాం’ అని మెత్తగా చెప్పారు. అలా చెప్పడం చాతకానితనంగా కనపడిందో ఏమో టాలీవుడ్ నుంచి మంత్రిగారిపై మరికొన్ని బాణాలు పడ్డాయి.
కనుక మరో సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చి “మా కొండా సురేఖ ఒంటరి కాదనే విషయం టాలీవుడ్‌లో అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పారు కదా?కనుక ఇకపై ఆమెకు వ్యతిరేకంగా ఎవరూ ఒక్క ముక్క మాట్లాడినా సహించబోము. టాలీవుడ్ పెద్దలకి వేరెవరి మీద అయినా ప్రత్యేక అభిమానం ఉంటే అది వారి వద్దనే దాచుకోండి కానీ దాంతో మమ్మల్ని ఊరికే విమర్శిస్తామంటే కుదరదు,” అని ఖరాఖండీగా చెప్పేశారు.
బహుశః ఇప్పటికే టాలీవుడ్‌లో అందరికీ తాము అత్యుత్సాహం ప్రదర్శించామని అర్దమయ్యే ఉంటుంది. అందువల్లే ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ మళ్ళీ అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి “చైతు-సమంత ఎందుకు విడిపోయారో చెప్పాలని” ప్రశ్నించినప్పటికీ టాలీవుడ్ నుంచి ఎవరూ స్పందించలేదు.
ఒకవేళ టాలీవుడ్‌లో ఇంకా ఎవరికైనా అర్దం కాకపోయి ఉంటే మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కూడా అర్దమయ్యేలా చెప్పేశారు. కనుక టాలీవుడ్‌లో ఎవరూ ఇకపై మంత్రి కొండా సురేఖని వేలెత్తి చూపే సాహసం చేయకపోవచ్చు.
అయినప్పటికీ మరో రెండు వేర్వేరు యుద్ధాలు ఇంకా మిగిలే ఉన్నాయి. 1 మంత్రి కొండా సురేఖకి కేటీఆర్‌కి మద్య మొదలైన ఈ యుద్ధం. 2. మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జునకి మద్య యుద్ధం.
వాటిని ఏవిదంగా ముగించాలో సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకి బాగా తెలుసు. కనుక యధాప్రకారం సినిమావాళ్ళు సినిమాలు, రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవచ్చు.




