ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లా పేరును డా.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా జోరుగా నిరసనలు జరుగుతున్నాయి. ఈరోజు వేలాదిగా ఆందోళనకారులు అమలాపురం, బ్యాంక్ కాలనీలోని మంత్రి పినిపె విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు, వారి ఇళ్ళ బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు.
ముందుగా కొందరు ఆందోళనకారులు వారి ఇళ్ళపై రాళ్ళతో దాడులు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రి విశ్వరూప్, ఆయన కుటుంబ సభ్యులను పోలీస్ వాహనాలలో అక్కడి నుంచి తరలించారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయి మంత్రి ఇంటికి, ఇంటి ముందు నిలిపి ఉంచిన ఎస్కార్ట్ వాహనానికి నిప్పు పెట్టారు.
అదే సమయంలో మరికొందరు ఆందోళనకారులు అమలాపురంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై రాళ్ళతో దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టారు. మంటలలో మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ళు వాటిలో ఉండే ఫర్నీచర్, సామాను అన్నీ కాలి బూడిదయ్యాయి. కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు కానీ పోలీసులు వారిని అడ్డుకొని లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టి పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు.
ఆందోళనకారులు వేలాదిమందిగా తరలిరావడంతో స్థానిక పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు. దీంతో ఏలూరు రేంజ్ డిఐజీ పాలరాజు అధ్వర్యంలో అదనపు బలగాలను అమలాపురానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందిస్తూ, “ప్రజల అభ్యర్ధన మేరకే అన్ని పార్టీల సమ్మతితో కోనసీమ పేరు మార్చాము. కానీ ఇప్పుడు హటాత్తుగా దానిని వ్యతిరేకిస్తూ అమలాపురంలో విధ్వంసం సృష్టించడం వెనుక ఎవరున్నారో మాకు తెలుసు. త్వరలోనే దర్యాప్తు జరిపించి ఆందోళనకారుల వెనుక ఎవరున్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకొంటాము,” అని అన్నారు.
ఈ కుట్రల వెనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారని మంత్రులు ఆరోపిస్తుండటంతో దీనికి రాజకీయరంగు పడింది. ఈ ఘటనలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, “ప్రజలందరూ సంయమనం పాటించాలి. డా. అంబేద్కర్ పేరును ఈ రొచ్చులోకి లాగడాన్ని నేను ఖండిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే ఇటువంటి సమస్యలు సృష్టిస్తోంది,” అని అన్నారు.
ఈ ఘటనలు, వైసీపీ ఆరోపణలపై చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించవలసి ఉంది.



