కాన్వాయ్‌లు కుదించుకుంటే సరిపోతుందా?

Prime Minister Narendra Modi convoy reduction amid petrol and diesel price hike in India

ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలంటూ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసి మర్నాటి నుంచే తన కాన్వాయ్‌లో 50 శాతం తగ్గించుకున్నారు. అయన సూచన, స్పూర్తితో కేంద్ర మంత్రులు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో సహా దేశంలోని పలువురు బిజేపి, ఎన్డీయే ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లో 50 శాతం తగ్గించుకున్నారు.

కానీ పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగబోతున్నాయని ప్రధాని మోడీ ఆరోజే సంకేతం ఇచ్చినట్లు దేశ ప్రజలు ముందే ఊహించారు.

ADVERTISEMENT

ఊహించినట్లే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకి రూ.3 చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధరలు తక్షణం అమలులోకి వచ్చాయి.

ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.04కి పెరగగా, డీజిల్ ధర లీటరుకి రూ.97.57కి పెరిగింది.

ఇది అమెరికా-ఇరాన్‌ యుద్ధ ప్రభావం కనుక ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని లేదా దేశీయ చమురు కంపెనీలను తప్పు పట్టలేము.

యుద్ధం మొదలైన తర్వాత పలుదేశాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. కానీ గత మూడు నెలలుగా చమురు సంక్షోభం నెలకొని ఉన్నప్పటికీ భారత్‌లో ధరలు పెంచలేదు.

ఈ కారణంగా చమురు కంపెనీలు సుమారు లక్ష కోట్లు వరకు నష్టపోయాయని కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మూడు రోజుల క్రితమే చెప్పారు. కనుక ఆ లోటు భర్తీ చేసుకోక తప్పదని ఆయన కూడా అప్పుడే సంకేతం ఇచ్చారు.

నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు కూడా అయిపోయాయి. ముందస్తు సంకేతాలు కూడా ఇచ్చారు. కనుక పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచేందుకు ఎటువంటి ఆటంకం, అభ్యంతరం ఉండబోదు.

ఈ ప్రభావం సరుకు రవాణా, దాంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు ధరలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే దేశ ప్రజలు పాలకుల వృధా ఖర్చులు, అనాలోచిత నిర్ణయాలకు చాలా భారం మోస్తున్నారు. చివరికి ఎక్కడో అమెరికాలో ఉండే ట్రంప్‌ అనాలోచిత నిర్ణయాలకు కూడా దేశ ప్రజలు ఈవిధంగా అదనపు భారం మోయక తప్పడం లేదు.

ప్రధాని మోడీతో సహా అందరూ కాన్వాయ్‌లు కుదించుకోవడం అభినందనీయమే. కానీ 140 కోట్లు పైగా జనాభా ఉన్న భారత్‌ వంటి దేశానికి ఈ మాత్రం పొదుపు ఏమాత్రం సరిపోదు.

పాలకుల వృధా ఖర్చులు, అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలి. ముఖ్యంగా విగ్రహాల ఏర్పాటు కోసం వందల కోట్ల ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

ఎన్నికలలో గెలిచేందుకు ఆకర్షణీయమైన హామీలు ఇవ్వడం మానుకోవాలి. ఓటు బ్యాంకు బలోపేతం చేసుకునేందుకు అమలుచేస్తున్న అనవసరమైన సంక్షేమ పధకాలను రద్దు చేసి ఆర్ధిక క్రమ శిక్షణ పాటించినప్పుడే దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. అప్పుడే సామాన్య ప్రజలపై ఇలా ఏదో ఓ పేరుతో అదనపు భారం వేయాల్సిన అవసరం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories