ఢిల్లీలో నిర్వహించిన డిజీ-ధన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ… డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈ 50 రోజులు తనను మీడియా ప్రశ్నించిందని, ఇండియా డిజిటల్ లావాదేవీల దిశగా ఎలా నడుస్తుందని… పేదవారి దగ్గర కనీసం మొబైల్ కూడా ఉండదని చెప్పిందని… తనను ప్రశ్నించిన మీడియాకు కృతజ్ఞతలు… అంటూ ఆశ్చర్యపరిచారు.
అయితే మీడియాపై ఎందుకు ఇలా మాట్లాడారో కూడా ‘లాజిక్’తో వివరించారు మోడీ. నిజానికి మీడియా వేసిన ప్రశ్నలను పరిశీలించే తాము నగదు రహిత లావాదేవీలను ఎంత పటిష్టంగా అమలు చేయాలో అన్న పథకాలను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చదువు రాని వారు సైతం నగదు రహిత లావాదేవీలు చేసేలా ఆలోచనలు చేశామని చెప్పారు. చదువురాని వారు కూడా గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓటేశారని గుర్తు చేశారు. కేవలం వేలి ముద్రతో లావాదేవీలు జరిపిస్తున్నామని చెప్పారు.
దేశంలోని నిరాశావాదుల కోసం తన దగ్గర ఏమీ లేదని, ఆశావాదులకి అవకాశాలు అందించే ఆలోచనలు మాత్రం ఉన్నాయని చెప్పారు. మీ చేతి వేళ్ల మీదే ఇకపై మీ భవిష్యత్తు ఉంటుందని, కేవలం వేలి ముద్రలతో నగదు రహిత లావాదేవీలు జరుపుకోవచ్చని, ‘భీమ్’ పేరుతో సరికొత్త యాప్ ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ‘భీమ్’ యాప్ తోనే అన్ని లావాదేవీలు జరుగుతాయని, ఈ యాప్‌తో డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయొచ్చని చెప్పారు.
రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలకు మొబైల్, ఇంటర్నెట్ అవసరం లేదని చెప్పారు. పేదవాడి బతుకును మార్చడానికే డిజిటల్ ఇండియా నినాదం తీసుకొచ్చినట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలు జరిపిన వారికి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘మెగా డ్రా’ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం వంద రోజుల పాటు ప్రతిరోజూ 15 వేల మందికి లక్కీడ్రా ద్వారా 1000 బహుమతి ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. 50 రూపాయల నుండి 3 వేల వరకు నగదు రహిత లావాదేవీలు చేసిన వారికి బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు.



