మోదీ పర్యటన: సింహాలు గాయపడ్డాయా.?

PM Narendra Modi with Revanth Reddy, Chandrababu Naidu and Pawan Kalyan during politically significant meetings in Telugu states.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా సుమారు 9 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలలో హీట్ ను పుట్టించాయి.

కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి రేవంత్ మీరు మాతో కలిసి నడవాలని, ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టి.కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ అధిష్టానం లో కూడా చర్చకు దారి తీస్తున్నాయి. బీజేపీ ముందస్తు రాజకీయ వ్యూహంలో భాగంగానే మోదీ రేవంత్ ను ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యానించారా.?

ADVERTISEMENT

లేదా టి.కాంగ్రెస్ లో రేవంత్ పై అనుమానాలు సృష్టించి, కాంగ్రెస్ అధిష్టానంలో రేవంత్ పై అపోహలు కలిగించేందుకు మోదీ ఈ రకమైన వ్యాఖ్యలు చేసారా.? లేక రేవంత్ ను మోదీ పరోక్షంగా బీజేపీ లోకి ఆహ్వానించేందుకు ఈ రకమైన వ్యూహాలు పన్నారా అన్నది ఇక్కడ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

అయితే ఏదేమైనా మోదీ – రేవంత్ మధ్య ఏర్పడిన ఈ సానుకూల వాతావరణం అటు బీజేపీ ప్రత్యర్థులతో పాటుగా ఇటు రేవంత్ ప్రత్యర్థుల మనసులను బాగానే గాయపరిచిందనే చెప్పాలి. దానికి తోడు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ తన మిత్రపక్ష పార్టీల అధినేతల ఇంటికి వెళ్లి స్వయంగా వారిని పలకరించడం, వాటి కుటుంబంతో కాసేపు సరదాగా సమయం గడపడం కూడా సింహాలుగా చెప్పుకునే కొందరి మనసులను గాయపరిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీయడం, వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, అటు పై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంటికి వెళ్లడం అక్కడ నారా లోకేష్ తో సహా వారి కుటుంబంతో కూడా సుమారు గంటసేపు సమయం గడపడం టీడీపీ, జనసేన ప్రత్యర్థి పార్టీలకు మింగుడు పడడం లేదు.

ఏపీలో కూటమి బంధం మరో 10 నుంచి 15 ఏళ్ళు ఇలానే కొనసాగాలని, కొనసాగుతుందని బాబు, పవన్, లోకేష్ పదేపదే బలంగా చెపుతుండడం, ఇప్పుడు మోదీ స్వయంగా బాబు, పవన్ ఇంటికి వెళ్లడంతో ఆ రాజకీయ బలాన్ని తమ బంధం మరింత ధృడంగా చేస్తుంది అనేలా మోదీ బీజేపీ నుంచి కూడా సంకేతాలు పంపినట్టయ్యింది.

దీనితో ఏపీలో రాబోయే ఎన్నికలలో తమదే అధికారం అంటూ కలలు కంటున్న వైసీపీ కి ఈ పరిణామం ఊహించని షాక్ అనే చెప్పాలి. టీడీపీ, జనసేన కూటమి నుంచి ఎలా అయినా బీజేపీ ని బయటకు తేవడం ద్వారా కూటమి బలాన్ని విచ్ఛిన్నం చేయాలనీ భావించిన వైసీపీ కి మోదీ పర్యటన పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా భావించాలి.

అలాగే అటు టీడీపీ వినాశనాన్ని కాంక్షించే బిఆర్ఎస్ కు కూడా వీరి ముగ్గురి భేటీ, రేవంత్ – మోదీ మధ్య ఏర్పడిన మంచి రాజకీయ వాతావరణం అన్ని కలగలిపి కేసీఆర్, కేటీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఇన్నాళ్లు మేము సింగిల్, సింహం సింగల్ గానే వస్తుంది, మాకు ఏ పార్టీతో పొత్తులేదు, ఆ అవసరం రాదు అంటూ తొడలు కొట్టిన వైసీపీ, బిఆర్ఎస్ లు ఇప్పుడు గాయపడ్ద సింహాలు మాదిరి తలలు బాదుకోవాల్సిందేనా.?

ADVERTISEMENT
Latest Stories