ఎలాంటి విషయాన్నైనా నిర్మొహమాటంగా వ్యక్తపరిచే ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయినపుడు రాని వారిపై విమర్శల వర్షం కురిపించారు. దాసరి ఎంతో మందికి సహాయం చేసారని, ఎన్నో ఇళ్ళల్లో దీపం వెలిగించుకోవడానికి దాసరి కారణమని, అయితే ఆయన ద్వారా లబ్ది పొందిన ప్రముఖులంతా కనీసం ఆయన పార్థీవ దేహాన్ని కడసారి చూడడానికి కూడా రాకపోవడం చూస్తుంటే… గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేసారు.
దాసరి వలన సాయం పొందిన వారి సంఖ్యకు, ఆయన చనిపోయినపుడు చూడడానికి వచ్చిన వారి సంఖ్యను పోలిస్తే… లెక్క సరిపోదని, సపోర్టింగ్ పాత్రలు చేసుకునే ఎంతో మందిని హీరోలుగా చేసిన ఘనత దాసరిదని, ఎంతో మంది హీరోయిన్లకు గుర్తింపును తీసుకొచ్చారని, కానీ వారంతా దాసరి గారిని కడసారి చూసేందుకు ఎందుకు రాలేకపోయారని ఆవేదన చెందుతూ ప్రశ్నించారు. అయితే తాను ఎవరి పేరును ప్రస్తావించే ఉద్దేశం లేదని, కానీ వారు చేసింది మాత్రం దారుణమని స్పష్టంగా చెప్పారు.
దాసరి అంతిమ వీడ్కోలుకు చిరంజీవి, బాలకృష్ణలు రాలేదన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ విదేశాలలో ఉండడంతో రాలేకపోయామని మీడియా వేదికలుగా తమ భావాలు వ్యక్తపరిచారు. అయితే మోహన్ బాబు టార్గెట్ చేసింది ఈ టాప్ హీరోలనే అన్న భావం వ్యక్తం కావడంతో… దీనిపై కూడా స్పష్టత ఇచ్చారు. ఊర్లో లేని వారి గురించి మనం మాట్లాడకూడదని… కానీ, అందుబాటులో ఉండి కూడా, రాకపోవడం సరైనది కాదని చెప్పడంతో మోహన్ బాబు టార్గెట్ బిగ్ షాట్స్ కాదన్న విషయం స్పష్టమైంది. చావు ప్రతి ఒక్కరికీ వస్తుందనీ… ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని కాస్త గట్టిగానే చెప్పారు ‘కలెక్షన్ కింగ్.’



