రాష్ట్ర విభజన సందర్భంగా ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ స్థాపించి, చివరి నిముషంలో పోటీ నుండి తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు గత రెండు సంవత్సరాలుగా హల్చల్ చేస్తూనే ఉన్నాయి. వైసీపీ నుండి బిజెపి వరకు అన్ని పార్టీల పేర్లు వినిపించగా, కిరణ్ మాత్రం రాజకీయాలకు దూరంగా వ్యక్తిగత జీవితాన్ని ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. అయితే కిరణ్ ఇలా ఉన్నా, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ తెలుగుదేశంలోకి కిషోర్ రాబోతున్నాడనే వార్తలు పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను మాజీ మంత్రి గల్లా అరుణ, టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్ తదితరులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇటీవల నల్లారి సోదరుల తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, పరామర్శించడానికి వెళ్ళిన ‘గల్లా అరుణ అండ్ కో’ ఈ దిశగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. దీనిపై కిషోర్ కుమార్ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నట్లుగా సమాచారం.
అయితే రాజంపేట ఎంపీ టికెట్ తో పాటు, టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కావాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత సుముఖత వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపధ్యంలో కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు బలపడుతున్నాయి. బహుశా మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి సోదరుడి బాటలోనే కిరణ్ పయనిస్తారా? లేక ఏ ‘సేన’ కోసమైనా పరుగులు పెడతారా? అన్నది ప్రశ్నార్ధకం కానుంది.



