టిడిపి యువనేత నారా లోకేష్ నేడు పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నియోజకవర్గంలో యువగళం 205వ రోజున పాదయాత్ర చేస్తున్నారు. నారా లోకేష్ ఇప్పటి వరకు 2,750 కిమీ పాదయాత్ర పూర్తిచేశారు.
భీమవరం పట్టణంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు దారిలో కియా ఎలక్ట్రిక్ కార్ల షో రూమ్ కనిపించినప్పుడు నారా లోకేష్ అక్కడ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టారు.
“అభివృద్ధి ప్రదాత ఎవరో అర్థమైందా రాజా?! ఇది భీమవరంలోని కియా కార్ల షోరూమ్. దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమను రప్పించి, ఉద్యోగాల పంట పండించారు దార్శనికత నేత చంద్రబాబునాయుడు. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50వేలమంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించాయి. 51 నెలల జలగన్న పాలనలో చేసిందేమిటి? ఫ్యాక్స్ కాన్, అమర్ రాజా, జాకీ, లులూ వంటి పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశాడు. ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాక చేపల దుకాణాలు, మటన్ మార్టులు పెట్టించాడు. అభివృద్ధి ప్రదాత ఎవరో, విధ్వంసకపాలనతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించింది ఎవరో అర్థమైందా రాజా?!” అంటూ నారా లోకేష్ చురకలు వేశారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళవుతోంది. సాధారణంగా ఏ ప్రభుత్వామైనా అధికారంలోకి రాగానే వివిద రంగాలకు సంబందించి తమ విధానాలను (పాలసీ)లను ప్రకటించి అమలుచేస్తుంటాయి. వైసీపీ ప్రభుత్వం కూడా అలాగే ప్రకటించింది. కానీ అవి ప్రకటనలకే పరిమితం అయ్యాయి. అయినా పర్వాలేదు.
కానీ చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలపై కక్షతో వారి హయాంలో తెచ్చిన పరిశ్రమలను, కంపెనీలను రాష్ట్రంలో మనుగడ సాగించలేని పరిస్థితి కల్పించడంతో అవి పొరుగు రాష్ట్రాలకి తరలిపోయాయి. అదే నారా లోకేష్ చెప్పారు. అభివృద్ధికి బదులు సంక్షేమ పధకాలకు, రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తుండటం వలన, రాష్ట్రంలో అనారోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
2023 మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో వైసీపీ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసింది. రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు, వాటితో 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటూ ప్రచారం చేసుకొంది. కానీ రాష్ట్రంలో ఇటువంటి అనారోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, ఎవరూ మాత్రం వందలు, వేల కోట్లు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు సాహసిస్తారు?
వందల కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమలో, వాణిజ్య సంస్థలో ఏర్పాటు చేసిన తర్వాత వేధింపులు మొదలైతే?ఒకవేళ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో విద్యుత్ కోతలు, మరోపక్క భారీగా విద్యుత్ చార్జీల మోత వంటి అనేక అంశాల గురించి ఆలోచించకుండానే 13.56 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేస్తారా?అని ఆలోచిస్తే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రజలను మభ్యపెట్టేందుకే ఆడిన ఓ నాటకమని అర్దమవుతుంది.
అదే… రాష్ట్ర ప్రభుత్వం చక్కటి విధానాలతో పరిశ్రమలను, ఐటి కంపెనీలను ప్రోత్సహిస్తే వాటి వలన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏవిదంగా ఉద్యోగాలు లభిస్తాయో నారా లోకేష్ ఈ సెల్ఫీ ఛాలెంజ్ ఫోటోతో తెలియజెప్పారు.



