ప్రధాని మోడీ చెప్పిన ఆ సమయం వచ్చేసినట్లేనా?

Narendra Modi Warns of Oil Crisis Amid US-Iran War Tensions

ప్రధాని మోడీ నోట్ల రద్దుతో దేశంలో అన్ని వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో లాక్ డవున్‌తో మరోసారి పెద్ద షాక్ ఇచ్చారు. అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా దేశంలో చమురు సంక్షోభం ఏర్పడి మళ్ళీ కోవిడ్ కాలం నాటి కష్టాలు సంభవించవచ్చని కొన్ని వారాల క్రితమే చెప్పారు.

నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ చమురు సంక్షోభం ముంచుకొచ్చేస్తోంది. కనుక దేశ ప్రజలందరూ పెట్రోల్, డీజిల్, ప్రైవేట్ వాహనాల వాడకం తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థని ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే ఏడాది పాటు బంగారం కొనుగోళ్ళు తగ్గించాలని వీలైతే పూర్తిగా కొనుగోలు మానేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రధాని మోడీ మళ్ళీ మరోసారి విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT

ఇరాన్‌తో యుద్ధం తమకి ‘వీకెండ్ పిక్నిక్’ వంటిదని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మూడు నెలలు కావస్తున్నా ‘పిక్నిక్’ ముగించలేకపోతున్నారు. ఇరాన్‌ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ యుద్ధంతో ఇరాన్‌ చమురు సరఫరా నిలిచిపోవడం ఒక ఎత్తు అయితే ప్రపంచ దేశాల చమురు రవాణాకు కీలకమైన ‘హోర్మూజ్ జలసంధి’ మూతపడుతుండటం మరో ఎత్తు.

కనుక ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్‌లో చమురు నిల్వలు ఆవిరైపోతాయి. కనుక పొదుపు పాటించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

ఆయన సూచనకి మూడు సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. 1. షేర్ మార్కెట్ పడిపోయింది. 2. మోడీకి పాలన చాతకాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. 3. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగబోతున్నాయని, వాటితో పాటు నిత్యావసర సరుకులు ధరలు పెరగబోతున్నాయనే భయాందోళనలు ప్రజలలో కలుగుతోంది.

కానీ అమెరికా-ఇరాన్‌ యుద్ధం ఎవరూ కాదనలేని వాస్తవం. అది ఇంకా కొనసాగితే యావత్ ప్రపంచ దేశాలలో ఇలాంటి పర్యవసానాలు తప్పవు. భారత్‌ అందుకు మినహాయింపు కాదు.

భారత్‌ వంటి దేశంలో ‘కోవిడ్’ దెబ్బకి సగానికి సగం మంది చనిపోతారని, రోడ్లపై శవాల గుట్టలు పేరుకుపోతాయని అభివృద్ధి చెందిన దేశాలు భావించాయి. కానీ లాక్ డౌన్ వంటి కటినచర్యలతో కోట్లాదిమంది ప్రజలు తీవ్ర కష్టనష్టాలకు గురైనప్పటికీ దేశం కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడింది. కోవిడ్ టీకాలు తయారు చేసి ప్రపంచ దేశాలకు కూడా సరఫరా చేసింది.

అదేవిధంగా ముంచుకొస్తున్న చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ ఇటువంటి సూచనలు చేశారని చెప్పవచ్చు.

ప్రజలకు సుద్దులు చెపుతున్నప్పుడు ముందుగా పాలకులు దానిని పాటించాల్సి ఉంటుంది. కనుక ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు, బిజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కాన్వాయ్‌లో 50 శాతం తగ్గించుకోబోతున్నట్లు తాజా సమాచారం.

ఇకపై కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంతో సహా అన్ని రంగాలలో పొదుపు మంత్రం పాటించబోతున్నట్లు తెలుస్తోంది. కనుక దేశ ప్రజలు వాతలకు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లే. ఎప్పుడు, ఏవిధంగా, ఎంత శాతం? అనేది త్వరలో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories