ఇండియాలో క్యాలెండర్ సంవత్సరం అంటే… జనవరి 1నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు. అదే ఆర్ధిక సంవత్సరం అంటే… ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు. బ్రిటిష్ వారు అమలు చేసిన ఇదే విధానం 1867 నుంచి అమలవుతోంది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ‘జనవరి – డిసెంబర్’ కాలాన్ని ఓ ఆర్థిక సంవత్సరంగా లెక్కిస్తుండగా, ఇండియా కూడా అదే దారిలో నడిచేందుకు సిద్ధమవుతోంది.
150 ఏళ్ల ‘ఏప్రిల్ – మార్చి’ ఫైనాన్షియల్ ఇయర్ సంప్రదాయాన్ని వదిలి వేయాలని మోడీ సర్కారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం జూలై లోనే మాజీ ఆర్థిక సలహాదారు శంకర్ ఆచార్య అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఆర్థిక సంవత్సరాన్ని మార్చే విషయమై సిఫార్సులు చేయాలని సూచించింది. పలు దఫాలుగా సమావేశమైన ఈ కమిటీ, పారిశ్రామిక సంఘాలు, వివిధ మంత్రిత్వ శాఖలతో సమావేశమై నివేదికను సిద్ధం చేసిందని, ఇది ఈ నెల 31న ప్రభుత్వానికి చేరనుందని ఆర్థిక శాఖ లోక్ సభకు వెల్లడించింది.
ఫైనాన్షియల్ ఇయర్ ను మార్చాలని 1984లో అప్పటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎల్కే ఝా నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇక ప్రస్తుతం కమిటీ సిఫార్సులు అందగానే, దానిపై మరోసారి చర్చించి శతాబ్దన్నర కాలంగా ఉన్న ‘ఏప్రిల్ – మార్చి’ సంప్రదాయానికి మోడీ సర్కారు తిలోధకాలు ఇచ్చేయనుందని తెలుస్తోంది.



