జూన్ 23వ తేదీన విడుదల కావాల్సిన మహేష్ బాబు “స్పైడర్” ఎప్పుడైతే వెనక్కి వెళ్లిందో, అదే తేదీన విడుదల చేయడానికి మరో రెండు సినిమాలు అధికారిక ప్రకటన చేసాయి. అందులో దిల్ రాజు – అల్లు అర్జున్ ల కాంభినేషన్ లో నిర్మాణం అవుతోన్న “దువ్వాడ జగన్నాధమ్” ఒకటి కాగా, ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ కొట్టి సక్సెస్ ఊపులో ఉన్న నాని – డివివి దానయ్యల “నిన్ను కోరి” చిత్రం మరొకటి. అయితే ఈ రెండింటిలో ‘దువ్వాడ’ పెద్ద సినిమా కావడంతో, ఖచ్చితంగా అదే విడుదల అవుతుందన్నది దాదాపుగా ఖరారైన అంశం.
మరి అప్పటికే విడుదలపై ప్రకటన చేసిన “నిన్ను కోరి” చిత్ర యూనిట్ ఎప్పటికి వాయిదో వేసుకుంటుందోనని అంతా భావించారు. అయితే సినీ వర్గాల లేటెస్ట్ న్యూస్ ప్రకారం… జూలై 7వ తేదీన “నిన్ను కోరి” సినిమాను విడుదల చేయడానికి నిర్మాత డివివి దానయ్య సన్నాహాలు చేసుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేవలం మెగా హీరోలతో మాత్రమే సినిమాలను నిర్మిస్తున్న దానయ్య, తన సన్నిహిత అల్లు అర్జున్ “దువ్వాడ” చిత్రానికి పోటీగా “నిన్ను కోరి” చిత్రాన్ని విడుదల చేయరన్న విషయం తెలిసిందే!
ముందుగా హల్చల్ చేసిన సమాచారం ప్రకారం, ఈ సినిమాను ‘ప్రీ పోన్’ అంటే జూన్ 23వ తేదీ కంటే ముందుగానే విడుదల చేయాలని భావించారు. అయితే మారిన లెక్కల నేపధ్యంలో “దువ్వాడ జగన్నాధమ్” నుండి రెండు వారాల పాటు వెనక్కి వెళ్ళాడు. ‘దువ్వాడ’ తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీనివ్వడానికి మరే చిత్రం బరిలో లేకపోవడమే, ఈ పోస్ట్ పోన్ కు కారణంగా తెలుస్తోంది. “దువ్వాడ జగన్నాధమ్” తర్వాత ఆగష్టు వరకు ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావడం లేదు.



