ఇటీవల కాలంలో ఏ సినిమా టాక్ విన్నా గానీ, ఒకే విధంగా ఉంటోంది. అదే… “ఫస్టాఫ్ బాగుంది… ఇంటర్వెల్ ఆసక్తికరంగా ఉంది… సెకండాఫ్ కాస్త డల్ గా ఉంది… సెకండాఫ్ బాగుంటే అదిరిపోయేది..!” అవును… చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా, విజయవంతమైన సినిమాలకు కూడా ఇదే రకమైన టాక్ ప్రేక్షకుల నుండి వ్యక్తమయ్యింది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన “ఖైదీ నంబర్ 150” పరిస్థితి కూడా అదే. కానీ, వీటిని భిన్నంగా నాగార్జున “ఓం నమో వేంకటేశాయ” సినిమా టాక్ రావడం విశేషం.
ఫస్టాఫ్ కాస్త డల్ గా ఉన్నప్పటికీ, సెకండాఫ్ సినిమాకు ఆయువుపట్టులా ఉందని, ఏమోషనల్ గా భావోద్వేగానికి గురి చేయడంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అభినయాన్ని అద్భుతంగా పండించడంలో కింగ్ నాగార్జున సక్సెస్ అయ్యారని, సెకండాఫ్ అంత ఆకట్టుకుంది కాబట్టే సినిమా నిలబడగలిగిందన్న టాక్ అటు సినీ ప్రేక్షకుల నుండి, ఇటు సినీ విశ్లేషకుల నుండి వ్యక్తమయ్యింది. ఓపెనింగ్స్ ఆశించిన రేంజ్ లో లేకపోయినప్పటికీ, భక్తిరస చిత్రం కావడంతో, నెమ్మదిగా పుంజుకుంటుందన్న నమ్మకాన్ని సెకండాఫ్ ఇవ్వగలిగింది.



