‘మస్త్, పరుగు, అదుర్స్’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన హీరోయిన్ షీలా, ఇటీవల కాలంలో తెలుగు తెరపై కనిపించింది లేదు. ఆ మాటకొస్తే… టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో కూడా నటించలేదు. మరి ఇప్పటివరకు ఏం చేస్తుందో ఏమో గానీ, ఒక వారం రోజుల ముందు తిరుమలలో ప్రత్యక్షమైంది. అయితే ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టడం కష్టం… అనిపించేలా దర్శనమివ్వడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.
సహజంగా మేకప్ తో సిల్వర్ స్క్రీన్ పై చూసిన హీరోయిన్లను బయట మేకప్ లేకుండా చూడడమే కాస్త కష్టమైన విషయం. అలాంటిది రూపురేఖలన్నీ మారిపోయిన షీలా బాహ్యా సౌందర్యం వీక్షకులకు షాక్ ఇచ్చినట్లయ్యింది. ఇదే ప్రశ్నను మీడియా వర్గాలు షీలాను ప్రశ్నించగా… ‘తానూ ఓ సినిమా కోసం ఇలా తగ్గాను’ అని బదులిచ్చింది. అయితే ఇందులో వాస్తవం లేదని భావించిన మీడియా వర్గాలు అదే ప్రశ్నను తిప్పితిప్పి అడగగా, అదే జవాబిచ్చింది.
తెలుగు సినిమాలలో మళ్ళీ ఎప్పుడు నటిస్తున్నారని అడగగా… ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నాను, వచ్చే ఏడాదిలో తెలుగు సినిమా ఉంటుందని చెప్పింది. చాలాకాలం తర్వాత మీడియా కంట పడడంతో కెమెరాలు క్లిక్ మంటున్న తరుణంలో ‘అసలు నేను వచ్చినట్లు మీకు ఎవరు చెప్పారు?’ అంటూ నవ్వుతూ అడిగింది. అయితే మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నలకు, ఫోటోలకు ఓపికగా బదులిచ్చింది షీలా. ‘నమ్మవేమో గానీ అందాల యువరాణి…’ అంటూ బన్నీ ఆలపించిన గీతం ఈ ముద్దుగుమ్మపైనే..!



