జగన్‌ చేసిన అపచారానికి పవన్ ప్రాయశ్చిత్తం!

Pawan Kalyan Deeksha

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాలలో ఓ కమ్యూనిస్ట్ కనబడుతుంటాడు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఆయనలో ఆధ్యాత్మికత కూడా ఎక్కువే. బహుశః ఈ రెండు భిన్నమైన లక్షణాల కలయికతో ఆయనలో మానవతావాది తరచూ బయటపడుతుంటాడు.

ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో టిడిపి, వైసీపిలు కత్తులు దూసుకుంటుంటే, పవన్‌ కళ్యాణ్‌ వాటికి భిన్నంగా ‘పాప పరిహారం’ చేసుకోబోతున్నారు. అదీ… వైసీపికి ఎంతో పేరు తెచ్చి పెట్టిన ‘11’ రోజుల పాటు దీక్ష చేసి!

ADVERTISEMENT

“ఏడుకొండలవాడా… క్షమించు! నీకు జరిగిన మహాపచారానికి 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేసుకొని వచ్చి దర్శనం చేసుకుంటాను….” అంటూ పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో చాలా పెద్ద సందేశం పెట్టారు.

గుంటూరు జిల్లా నంబూరులో శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి 11 రోజులపాటు పవన్‌ కళ్యాణ్‌ దీక్ష చేపట్టబోతున్నారు. దీక్ష ముగిసిన తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు.

గత ప్రభుత్వానికి భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనందునే ఇంత అకృత్యానికి పాల్పడిందని, అయితే తిరుమల పాలకమండలి సభ్యులు, ఉద్యోగులు ఎవరూ కూడా ఈ మహాపచారాన్ని గుర్తించన్నట్లు నటిస్తూ దానిని కొనసాగించడం తనకు చాలా బాధ కలిగిస్తోందని పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మాన్ని పునరుద్ధరించుకునేందుకు నావంతు ప్రయత్నంగా నేను చేస్తున్నానని ఆ సందేశంలో పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.

తిరుమలలో జరిగిన ఈ అపచారంపై దేశవ్యాప్తంగా భక్తులు అందరూ చాలా ఆవేదన చెందుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం విన్నప్పుడు తాను కూడా వారిలో ఒకడినని చెప్పుకున్నట్లు అనిపిస్తుంది. ఆయనలో ఆధ్యాత్మిక చింతన ఇందుకు ప్రేరేపించి ఉండవచ్చనిపిస్తుంది.

అయితే ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా అధికారం, యంత్రాంగం కూడా ఆయనకి అందుబాటులోనే ఉంటుంది. కనుక పవన్‌ కళ్యాణ్‌ వాటిని వినియోగించి రాష్ట్రంలో ఇటువంటి అపచారాలు పునరావృతం కాకుండా అరికట్టగలిగితే ప్రజలందరూ హర్షిస్తారు.

ADVERTISEMENT
Latest Stories