గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వం రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేయడం, అదే సమయంలో తెర వెనుక కొన్ని రాజకీయశక్తులు చేతులు కలపడంతో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి గత ఎన్నికలకు భిన్నమైన రాజకీయ వాతావరణం రాష్ట్రంలో నెలకొని ఉందని వైసీపీ కూడా గ్రహించింది. అందుకే రెండేళ్ళ ముందుగానే ఎన్నికల సన్నాహాలు ప్రారంభించేసింది.
కానీ అది చేస్తున్న ప్రయత్నాలతో ప్రజల నుంచి ఆశించినంత గొప్ప స్పందన రావడం లేదు. గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు వైసీపీ నేతలను నిలదీస్తుండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో వైసీపీ గొప్పగా ప్రారంభించిన బస్సు యాత్రకు ప్రజాధారణ కరువవడంతో అది కూడా తుస్సుమంది.
సరిగ్గా ఇటువంటి సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రంగప్రవేశం చేసి ‘మూడు ఆప్షన్స్’ ప్రకటించడంతో వైసీపీ వ్యూహం ఫలించినట్లయింది. బిజెపి-జనసేనల మద్య చిచ్చుపెట్టేందుకే సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు అంటూ ప్రచారం చేశారు. వారి ఉచ్చులో బిజెపి, టిడిపిలు చిక్కుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ చిక్కుకొన్నారు.
జనసేనతో పొత్తులు కావాలంటే తననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని అటు బిజెపికి, ఈసారి టిడిపి తగ్గితేనే పొత్తులు అన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో వైసీపీ కోరుకొంటున్నట్లే మూడు పార్టీల మద్య గ్యాప్ వచ్చింది. వాటి మద్య చిచ్చు పెట్టాలనే తమ వ్యూహం ఫలించినందుకేనేమో సిఎం జగన్మోహన్ రెడ్డిలో మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగినట్లుంది.
బుదవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌ఛార్జులతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో 150 కాదు మొత్తం 175 స్థానాలు మనమే గెలుస్తాము. అదే లక్ష్యంగా పెట్టుకొని అందరూ గట్టిగా కృషి చేయాలి. కుప్పం మున్సిపాలిటీని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను మనం అనుకొన్నామా? కానీ అన్నీ మనమే గెలుచుకొన్నాము. అలాగే వచ్చే ఎన్నికలలో కుప్పంతో సహా 175 శాసనసభ స్థానాలు మనమే గెలుచుకోవాలి. ఇప్పటి నుంచి గట్టిగా కష్టపడితే అదేమీ అసాధ్యం కాదు,” అని అన్నారు.
జనసేన ఒక్క తప్పటడుగు వేసినా దాంతో వైసీపీ లబ్ది పొందుతుందని ఇది స్పష్టం చేస్తోంది. కనుక ఇకనైనా పవన్ కళ్యాణ్ కాస్త ఆచితూచి మాట్లాడితే మంచిది.



