తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే, హిందూమతంపై పేటెంట్ హక్కులు తీసుకున్నట్లు వ్యవహరించి బీజేపీ ఈ అంశంపై కనీసం స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
దీని గురించి పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, సనాతన ధర్మం, దాని పరిరక్షణ గురించి మాట్లాడుతూ దాని జోలికి ఎవరూ రావద్దని హెచ్చరించడం, ఇవాళ్ళ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లు కడగటం వంటివన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా కంటే బీజేపీ నాయకుడిగానే కనిపిస్తున్నారు. బహుశః ఈ పదిరోజులు కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఇటువంటి మరిన్ని మాటలు వినిపించినా ఆశ్చర్యం లేదు.
అయితే పవన్ కళ్యాణ్ తిరుమలలో జరిగిన ఈ అపచారానికి బాధపడి ఇవన్నీ చేస్తున్నారా లేక బీజేపీ ఫార్ములాని అమలుచేస్తున్నారా?అనే ప్రకాష్ రాజ్ ప్రశ్న కూడా ఆలోచింపజేస్తుంది.
ఓ పార్టీ ఓటు బ్యాంకుని మరో పార్టీ తన్నుకుపోయేందుకు ప్రయత్నిస్తే ఆ పార్టీ తప్పకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.
ఉదాహరణకు సంక్షేమ పధకాలతో వైసీపికి ఓటు బ్యాంక్ నిర్మించుకున్నామని గట్టిగా నమ్మిన జగన్, వారి ఇళ్ళకు తన బొమ్మతో ‘నువ్వే మా నమ్మకం మా భవిష్యత్’ స్టికర్స్ అంటింపజేశారు. తద్వారా ప్రత్యర్ధులు వారి జోలికి పోవద్దని హెచ్చరించిన్నట్లే భావించవచ్చు.
అదేవిదంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందూ పరిరక్షణ గురించి గట్టిగా మాట్లాడుతూ, ఈవిదంగా హడావుడి చేస్తుంటే ఏపీ బీజేపీ కూడా పోటీగా హడావుడి చేసి ఉండాలి. కానీ ఏపీ బీజేపీ నేతలందరూ అసలు తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం గురించి తెలియన్నట్లు, సనాతన ధర్మ పరిరక్షణ, ఆలయాలు, చర్చిలు, మసీదుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు వినన్నట్లు అందరూ మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు చాలా తక్కువే కావచ్చు కానీ బీజేపీ హిందూమతం ఆధారంగానే రాజకీయాలు చేస్తుంటుంది. కనుక యావత్ దేశాన్ని కుదిపేస్తున్నా ఈ అంశంపై చాలా మాట్లాడి ఉండాలి. కానీ ఏపీ బీజేపీ నేతలు మొక్కుబడి ఖండనలతో సరిపెట్టారు.
అంటే పవన్ కళ్యాణ్‌కి బీజేపీ లీడ్ ఇచ్చి వెనక్కు తగ్గుతోందా లేక పవన్ కళ్యాణ్‌కి బీజేపీతో భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




