పవన్‌ సనాతన టార్గెట్ 2029 ఎన్నికల కోసమేనా?

Pawan Kalyan

పవన్‌ కళ్యాణ్‌ పవర్ స్టార్‌గా ఎదిగేందుకు ఎంత శమించారో ఆ తర్వాత జనసేన అధ్యక్షుడుగా రాజకీయాలలో నిలద్రొక్కుకోవడానికి అంతకంటే చాలా ఎక్కువే శ్రమించారు. పదేళ్ళు రాజకీయాలలో డక్కామొక్కీలు తిన్న తర్వాత కాపులతోను మమేకం కాక తప్పలేదు. అనేక అవమానాలు, అవహేళనలు, విమర్శలను చాలా సహనంతో భరించి చివరికి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అనిపించుకున్నారు.

ఈవిషయంలో పవన్‌ కళ్యాణ్‌ కంటే చాలా పాపులారిటీ, పలుకుబడి ఉన్న ఆయన అన్న చిరంజీవి రాజకీయ లక్ష్యం చేధించడంలో తడబడి వెనక్కు తగ్గారు కానీ పవన్‌ రెండు రంగాలలో విజయం సాధించారని చెప్పవచ్చు.

ADVERTISEMENT

కనుక ఎంతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్న తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ‘సనాతన ధర్మ పరిరక్షణ’ అంటూ కొత్త మార్గం వైపు ప్రయాణిస్తుండటం బహుశః జనసేన నేతలకు, కార్యకర్తలకు ముఖ్యంగా ఆయన వీరాభిమానులను చాలా ఆందోళన కలిగిస్తుండవచ్చు.

పవన్‌ కళ్యాణ్‌కి మొదటి నుంచి ఆధ్యాత్మికత భావాలు, దేవుడు, భక్తి, నమ్మకాలు ఉన్నాయి. పలుమార్లు దీక్షలు చేశారు కూడా. కనుక పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడటం మరీ విచిత్రంగా అనిపించదు.

కానీ పవన్‌ కళ్యాణ్‌ సినీ, రాజకీయ ప్రస్థానాలు సాగిన తీరు చూస్తే ఏదీ హటాత్తుగా జరుగలేదు. ఓ లక్ష్యం ఎంచుకున్నాక తనను తాను మార్చుకొంటూ ముందుకు సాగుతూ అనుకొన్న లక్ష్యాన్ని చేరుకున్నారు.

కనుక ఈ ‘సనాతన ధర్మ పరిరక్షణ’ కూడా అటువంటి మరో పెద్ద లక్ష్య సాధన కోసమే ఎంచుకున్నారా?అని ఆలోచిస్తే అవుననే అనిపిస్తుంది.

దీనిని రాజకీయ కోణంలో నుంచి చూస్తే, ప్రధాని నరేంద్రమోడీ గౌరవించే వ్యక్తులలో పవన్‌ కళ్యాణ్‌ కూడా ఒకరు. కొన్ని విషయాలలో వారిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలూ ఒకేలా ఉండటం ఇందుకు ప్రధాన కారణం కాగా వాటిలో హిందుత్వ అజెండా ‘ఫెవీకాల్’లా వారిద్దరినీ జోడించిందని చెప్పవచ్చు.

అయితే పవన్‌ కళ్యాణ్‌ హిందుత్వ ఆలోచనలు వ్యక్తిగతం కాగా, బీజేపీ హిందుత్వ సిద్దాంతాన్ని రాజకీయాలతో మేళవించి లబ్ధి పొందుతోంది.

ఈ హిందుత్వ అజెండాతో బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలలో పట్టు సాధించగలుగుతోంది. కానీ దక్షిణాది రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన భావజాలం నెలకొని ఉండటంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ కాస్త పట్టు సాధించగలిగింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ మూడు రాష్ట్రాలలో బీజేపీకి పట్టు చిక్కడం లేదు.

కనుక ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత నమ్మకస్థుడు, దక్షిణాది రాష్ట్రాలలో మంచి గుర్తింపు కలిగిన పవన్‌ కళ్యాణ్‌ని తన అస్త్రంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారేమో?పవన్‌ కళ్యాణ్‌ కూడా అందుకు అంగీకరించి, సనాతన ధర్మ పరిరక్షణ అంటున్నారేమో? అనే సందేహం కలుగుతోంది.

ఒకవేళ ఇదే నిజమనుకుంటే, ప్రధాని నరేంద్రమోడీ, పవన్‌ కళ్యాణ్‌ 2029 ఎన్నికలు లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు భావించవచ్చు. అప్పుడు ముందుగా టిడిపి, తర్వాత వైసీపి రెండూ కూడా అప్రమత్తం కావలసి ఉంటుంది.

ఇప్పుడే ఈవిదంగా ఆలోచించడం తొందరపాటే అవుతుంది. ఈరోజు (గురువారం) సాయంత్రం ‘సనాతన ధర్మ డిక్లరేషన్’ ప్రకటిస్తానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. కనుక ఆయన చెప్పింది విన్న తర్వాత మున్ముందు ఏ మార్గంలో పయనించబోతున్నారో కాస్త స్పష్టత రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories