కోట్లాదిమంది హిందువులున్న భారత్‌లో లౌకికవాదం పేరుతో హిందూమతాన్ని అవహేళన చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. హిందూ మతాన్ని వేరెవరో కాదు హిందువులే కించపరుచుకొంటున్నపుడు వేరెవరినో నిందించి ఏం ప్రయోజనం.
రాజకీయాల కోసం సృష్టించబడిన కుహానా లౌకికవాదం… హిందూమతాన్ని ఓ బూచిగా చూపిస్తుంటే ఎవరూ కిమ్మనడం లేదు. అయితే హిందూమతం విలువను ఎవరైనా పెంచగలరేమో కానీ తగ్గించలేరు. అందువల్లే ఎంతగా ఈసడింపబడుతున్నా యుగయుగాలుగా హిందూమతం బలంగా నిలబడి ఉంది. ఎవరూ పనిగట్టుకొని ప్రచారం చేయకపోయినా, దండయాత్రలు, మత మార్పిడులు చేయకపోయినా హిందూ మతం విశ్వవ్యాప్తమై ఉంది.
నిజానికి హిందూ మతంలోనే అసలైన లౌకికవాదం ఉంది కనుకనే దేశంలో ఇన్ని మతాలు, కులాలు, జాతుల ప్రజలు కలిసి జీవించగలుగుతున్నారని చెప్పవచ్చు.
కానీ కొన్ని రాజకీయ పార్టీలు తాము సృష్టించిన కుహనా లౌకికవాదమే ఈ దేశాన్ని విడిపోకుండా కాపాడుతోందని భ్రమిస్తూ, ప్రజలను కూడా భ్రమింపజేస్తున్నాయి. తినగ తినగ వేప తియ్యగా ఉన్నట్లు చివరికి తమదే నిజమైన లౌకికవాదం అని అందరూ గట్టిగా నమ్మేస్తున్నారు కూడా.
కనుక హిందూ మతంలో ఉన్న ఆ లౌకికవాదాన్నే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ద్వారా వెలికితీసి చెపుతున్నారని భావించవచ్చు.
మన (హిందూ) మతాన్ని మనం గౌరవించుకుందాము. ఇతరుల మతాలను కూడా గౌరవిద్దాము. కానీ ఎవరూ ఎవరి మతాన్ని కించపరుచుకోవద్దు… మతం పేరుతో కీచులాడుకోవద్దు. సనాతన ధర్మం ఇదే చెపుతోంది. దానినే పవన్ కళ్యాణ్ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవిదంగా చెప్పాలంటే హిందూ మతాన్ని మళ్ళీ పరిచయం చేస్తున్నట్లు అనుకోవచ్చు. మళ్ళీ పరిచయం అని ఎందుకంటే, హిందూ మతాన్ని ఆచరించే హిందువులకి కూడా దాని పట్ల ఆసక్తి, చిత్తశుద్ధి కొరవడుతున్నందునే.
హిందూ మతం అనంతమైనది. దానిని పూర్తిగా అర్దం చేసుకోవడానికి ఓ మనిషి జీవితం సరిపోదు. మనం సముద్రం వద్దకి చెంచా పట్టుకు వెళితే అన్ని నీళ్ళు మాత్రమే లభిస్తాయి. బకెట్ తీసుకువెళ్తే అన్ని నీళ్ళే లభిస్తాయి. అదే విదంగా హిందూ మతం గురించి తెలిసింది కొంతే… తెలియంది మహా సాగరమంత.
కానీ కనీసం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే హిందూ మతంపై కుహనా లౌకికవాద మేడావులు ఏవేవో కామెంట్స్ చేసేస్తుంటారు. హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడేవారు అసలు సిసలైన లౌకిక వాదులుగా చెలామణి అయిపోతుండగా, ఇలా… హిందూమతం గురించి మాట్లాడినవారిపై ‘మతతత్వవాది’ ముద్ర పడిపోతుంది. కుహనా లౌకికవాదానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది?
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సృష్టించుకున్న ఈ కుహనా లౌకికవాదం ఎంతగా బలపడిందంటే, హిందూ మతాన్ని మింగేసే అంత! కనుక సనాతన ధర్మంలో పేర్కొన్న విదంగా అసలైన లౌకికవాదాన్ని పవన్ కళ్యాణ్ వెలికి తీసి దాంతోనే హిందూ మతాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నట్లు భావించవచ్చు.
అయితే గుళ్ళు, మసీదులు, చర్చిలకు వెళ్ళివచ్చినంత మాత్రన్న, పండితులు, మతగురువులు చెప్పే ప్రవచనాలు విన్నంత మాత్రన్న, మంచి పుస్తకాలు చదివినంత మాత్రాన్న ఎవరూ మంచివాళ్ళుగా మారిపోరు. మారిపోయి ఉంటే నేడు ఇన్ని సమస్యలు ఉండేవే కావు కదా?
కానీ మన సనాతన ధర్మంలో ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే చిన్న హితోక్తి ఉంది. కనుక ఆ ధర్మాన్ని కాపాడుకుంటే చాలు… అదే సమాజాన్ని కాపాడుతుంటుంది. యుగయుగాలుగా ధర్మాన్ని కాపాడేందుకు అనేక మంది తమవంతు కృషి చేస్తూనే ఉన్నారు కనుకనే ఈ సమాజం… ఈ ప్రపంచం ఇంకా ఇలా మిగిలి ఉంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ధర్మ పరిరక్షణకు ఉడతా భక్తిగా తనవంతు కృషి మొదలుపెట్టారని భావించవచ్చు. కానీ ఈ ప్రయత్నాల వెనుక ఆయనకు ఏవైనా రాజకీయ ఆలోచనలు ఉండి ఉంటే, అప్పుడు ఆయన కూడా హిందూ మతం పేరుతో రాజకీయాలు చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని మరిచిపోకూడదు.




