రొటీన్ విషయాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా అనాసక్తి అన్న విషయం తెలిసిందే. సహజంగా ప్రస్తుత ట్రెండ్ లో అందరూ ఫాలో అయ్యే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. ట్విట్టర్ ఎకౌంటు అయితే ఉంది గానీ, పవన్ స్పందించాలంటే మాత్రం… రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ బీభత్సకరమైన రాజకీయ వాతావరణం ఏర్పడాలి. అప్పుడు గాని, పవన్ కు ట్విట్టర్ గుర్తుకు రాదు అన్న విషయాన్ని ఇప్పటికే పలు ఉదంతాలు వివిధ సందర్భాలలో నిరూపించాయి.
అయితే ఇలా రొటీన్ మోడ్రన్ లైఫ్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్… ఒక్క ‘సెల్ఫీ’ విషయంలో మాత్రం ముందడుగు వేసినట్లున్నారు. గతంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక మీద తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెల్ఫీలో భాగం అయిన పవన్, తాజాగా లండన్ లో మరో సెల్ఫీలో దర్శనమిచ్చారు. ఈ రెండు సందర్భాలలో మాత్రమే పవన్ ఫోన్ పట్టుకుని సెల్ఫీ తీసారు.
కూచిపూడి నృత్య కళాకారులతో కలిసి పవన్ దిగిన ‘సెల్ఫీ’ సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. చూడబోతుంటే… పవన్ కూడా సెల్ఫీ మాయలో పడిపోయినట్లుగా కనపడుతున్నారు. ‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు తానూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనిపిస్తుంది’ అంటూ పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



