ఈ నెల 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో కొన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తోది. కనుక పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ఈ నెల 7,8 తేదీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
ఏపీ నేతలు ఎవరైనా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే, మొట్ట మొదట బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ అభ్యంతరం చెపుతుంటుంది. కానీ ఈసారి ముందుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో విశ్లేషించారు. అయన పవన్ కళ్యాణ్‌ని విమర్శించినప్పటికీ ఆయన వేసిన బాణాలన్నీ తెలంగాణ బిజేపి నేతలకే గుచ్చుకునేలా ఉన్నాయి.
కనుక ఆయనకి పవన్ కళ్యాణ్ కాదు.. తెలంగాణ బిజేపి నేతలే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకో చూద్దాం.
“తెలంగాణలో బిజేపికి బలం లేదు. అందుకే మున్సిపల్ ఎన్నికలకు కూడా తమ జాతీయ నాయకులను తెచ్చుకుని ప్రచారం చేసుకుంటోంది. అయినప్పటికీ నమ్మకం లేక ఏపీకి చెందిన పవన్ కళ్యాణ్‌ని కూడా బ్రతిమాలుకొని తెచ్చుకొని ఎన్నికల ప్రచారం చేయించుకుంటున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం, ప్రజల యాస, భాషల గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. కనుక ఇక్కడి ప్రజలు ఆయన మాట వినరు. ఆయన చెప్పినా బిజేపికి ఓట్లు వేయరు. కనుక ఆయన ఏపీలో రాజకీయాలు చేసుకుంటే మంచిది.
ఈ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లు గెలుచుకోబోతోంది. ఎందుకంటే, మాది ప్రజా ప్రభుత్వం. ప్రజల కోసమే పనిచేస్తోంది. బిజేపి మాకు పోటీయే కాదు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు శాసనసభ ఎన్నికలలో ఒకసారి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయితీ ఎన్నికలలో వరుసగా తిరస్కరిస్తూనే ఉన్నారు. ఇప్పుడూ అలాగే తిరస్కరించబోతున్నారు,” అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
తెలంగాణ బిజేపి గురించి ఆయన చెప్పిన మాటలు చాలా చేదుగా ఉన్నప్పటికీ వాస్తవమే. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయితీ ఎన్నికలలో బిజేపి మూడో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ బిజేపి నేతల మద్య ఐఖ్యత లేకపోవడం, తెలంగాణ రాజకీయాలలో బిజేపి అధిష్టానం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుండటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కనుక మహేష్ కుమార్ గౌడ్ విమర్శలకు తెలంగాణ బిజేపి నేతలే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.






