ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల హటాత్తుగా ఆంధ్రాలోకి ఊడిపడ్డారు. ఆమె తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డినే ప్రధానంగా టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపి అంటే జగన్, జగన్ అంటే వైసీపి అని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల చేస్తున్న ఈ విమర్శలు, ఆరోపణలతో ‘జగన్ ఇమేజ్’ దెబ్బ తింటే, వైసీపి తీవ్రంగా నష్టపోతుందని వైసీపి రాజకీయ పండితులు గ్రహించిన్నట్లే ఉన్నారు. కనుక ఇక ఆమెను ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించినట్లే ఉన్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఆమె తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు ఆడపిల్లనంది. ఇక్కడే పెళ్ళి చేసుకున్నాను. ఇక్కడే పిల్లల్ని కన్నాను. ఇక్కడే చచ్చిపోతాను అంటూ నేను ఆడపిల్లనే అంది. ఇప్పుడు ఏపీకి వచ్చి నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. కనుక ఈడపిల్లనే అని అంటోంది. కనుక ముందు తాను ఆడపిల్లా… ఈడపిల్లా?ఆమే చెప్పాలి,” అని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా పేరుతో జగన్మోహన్ రెడ్డి దీక్షలు, ధర్నాల పేరుతో డ్రామాలు ఆడి ప్రజలను మోసం చేశారనే వైఎస్ షర్మిల విమర్శలకు పేర్నినాని సమాధానం చెప్పకుండా దాటవేస్తూ, “కాంగ్రెస్ పార్టీ తన అన్న జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసిందని, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చిందని వైఎస్ షర్మిలే ఆరోపించారు. ఇప్పుడు అవన్నీ మరిచిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి నాశనం చేసింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీయే అని వైఎస్ షర్మిల స్వయంగా అనేకసార్లు విమర్శించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో చేరి, తండ్రిని, అన్నని దెబ్బ తీసిన అదే సోనియాగాంధీ భజన చేస్తున్నారు,” అని పేర్ని నాని విమర్శించారు.
“మన రాజకీయ నాయకులలో కేఏ పాల్, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల ముగ్గురూ ఒక్కలాంటి వారే. వారి ఏం మాట్లాడుతారో వారికే తెలీదు. వారి మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. మేమూ పట్టించుకోనవసరం లేదు…” అంటూ పేర్ని నాని షర్మిలని తీసి పడేశారు.
వైఎస్ షర్మిల ఆడపిల్లా… ఈడపిల్లా తేల్చుకోమంటే ఆమె అన్న జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే మాట వర్తిస్తుంది కదా? ఎందుకంటే ఆయన కూడా తెలంగాణలో రాజకీయాలు చేశారు. కానీ ఈ విషయంలో ఆయన చెల్లి కంటే చాలా తెలివిగా వ్యవహరించారు.
రాష్ట్రం విడిపోతే తెలంగాణలో రాజకీయాలు చేయలేమని ముందే గ్రహించి ‘సమైక్యాంధ్ర’ జెండా పట్టుకుని ఏపీకి వచ్చేశారు. ఆనాడు దూరదృష్టితో ఆలోచించి ఏపీకి వచ్చేశారు కనుకనే నేడు జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఈ విషయం గ్రహించడానికి వైఎస్ షర్మిలకు చాలా సమయం పట్టింది!
ఎట్టకేలకు ఆమెకు జ్ఞానోదయం కలగడంతో ఆమె కూడా కాంగ్రెస్ జెండా పట్టుకుని ఏపీకి ముఖ్యమంత్రి అవుదామని వచ్చేశారు. అన్నా చెల్లెల్లు కాస్త ముందూ వెనుకా అంతే తేడా!




