గెలుపు కోసం మండుటెండలను సైతం లెక్క చేయక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు రాజకీయ పార్టీల నాయకులు. ఈ రాజకీయ నాయకులు ఏర్పాటు చేస్తున్న సభలకు వస్తున్న రాష్ట్ర ప్రజానీకంలో కొంతమంది వడదెబ్బ బారిన పడుతున్నారు.
తమ అభిమాన నాయకుడిని చూడాలనో, వారికి మద్దతుగా నిలవాలనో, లేక రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులకు ఆశపడో స్థానిక ప్రజలు ఆయా పార్టీల నేతల మీటింగ్లకు హాజరవుతున్నారు. అధికారం కోసం ఎండలను లెక్క చేయని నాయకులు అధికారం అందగానే ప్రజలను లెక్కచేయరు అనేది గత ఐదేళ్లుగా తెలియచేస్తూనే వస్తున్నారు అధికార పార్టీ నేతలు.
అధికారం కోసం ఎవరి అనుమతి తీసుకోకుండానే ప్రతి ఇంటి తలుపు తట్టి, ప్రతి గడప తొక్కే రాజకీయ నాయకులు ఒక్కసారి అధికారం రాగానే ఇదే ప్రజలను అనుమతి లేనిదే తమ ప్యాలస్ లకు దరిదాపులకు కూడా చేరనివ్వరనేది చరిత్ర చెప్పిన పాఠాలే. అయినా సాధారణ ప్రజలలో చైతన్యం రాదు…రాజకీయ నాయకులలో మార్పు రాదు.
ముఖ్యమంత్రి జగన్ ప్రచార కార్యక్రమాల దృష్ట్యా ఆయన భద్రతా కారణాల పేరు చెప్పి ఎక్కడిక్కడ కరెంట్ వైర్ లను కట్ చేస్తూ, వాహనాలను ఆపేస్తూ, చెట్లను నరికేస్తూ, వ్యాపారస్తుల షాపులను మూయిస్తూ అధికారులు చేస్తున్న హడావుడికి ప్రజలు అల్లాడుతున్నారు.
ఒకపక్క ఉక్కపోత…మరోపక్క కరెంట్ కోత, ఏంటి మాకీ హింస అంటూ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వృద్దులు, పిల్లలు ఈ వడదెబ్బ బారిన పడి అనారోగ్యాల పాలవుతున్నారు. గత నెలలో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో పిన్షన్ల పంచాయితీ సృష్టించి అనేకమంది వికలాంగులను, వృద్ధులను రోడ్ల మీదకు తెచ్చి వారి ప్రాణాలను బలి తీసుకున్నదెవరు..? ఆ నింద మోసిందెవరు..?
తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ నే ఇలా చేసింది అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం కరెంట్ వైర్ లు కట్ చేసి ప్రజలను ఉక్కపోతలో నెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతుందో చెప్పగలదా..? ప్రజల కోసమే వస్తున్నాం అంటూ అదే ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్న నేతలకు అటు వడ దెబ్బ తో పాటు ఇటు ఓటు దెబ్బ కూడా పడే ప్రమాదం లేకపోలేదు.




