వైసీపీ చేయదు… కూటమి చేయలేదు!

AP coalition vs YSRCP politics

ఏపీలో వైసీపీ, కూటమి ప్రభుత్వ రాజకీయాలు నిశితంగా గమనిస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఓసారి ఏదో అంశంపై కత్తులు దూసుకోవడం ఆ తర్వాత దానిని పక్కన పడేసి మరొకటి పట్టుకొని పోరాడుకుంటాయి. గత 16 నెలలుగా ఇలాగే సాగుతోంది.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల పట్ల సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు కూటమి ప్రభుత్వం కొన్ని రోజులు హడావుడి చేసింది. ఇప్పుడు చేయడం లేదు. కానీ నేటికీ సోషల్ మీడియాలో వైసీపీ అటువంటి పోస్టులు పెడుతూనే ఉంది! కానీ పట్టించుకోవడం లేదిప్పుడు.

ADVERTISEMENT

ఆ తర్వాత తిరుపతి లడ్డూ, కాకినాడ పోర్టు, రేషన్ బియ్యం, సీజ్ ది షిప్, మద్యం కుంభకోణం వంటివి చాలా జరిగాయి. కానీ వాటిలో ఏదీ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. కనీసం వాటి కధ ఎంత వరకు వచ్చిందో ఎవరికీ తెలీదు.

వైసీపీ కూడా ఓసారి కల్తీ మద్యం, మరోసారి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ ఏదో హడావుడి చేస్తుంది. కానీ ఏదీ ఎక్కువ కాలం కొనసాగించదు. మరో స్పైసీ అంశం దొరికే వరకు అది పట్టుకొని వ్రేలాడుతుంది అంతే!

కూటమి ప్రభుత్వం వైసీపీపై అన్నితీవ్ర ఆరోపణలు చేసి అన్ని పోలీస్ కేసులు నమోదు చేయించినప్పుడు వాటిలో దోషులకు శిక్షలు పడేలా చేసి వారి వలన రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయగలగాలి కదా? అప్పుడే ఈ ప్రభుత్వం చాలా శక్తివంతమైనదని ప్రజలు నమ్ముతారు.

కానీ ఏ ఒక్క కేసులోను ఎవరికీ శిక్షలు పడేలా చేయలేకపోయింది. వివిధ కేసులలో జైలుకి వెళ్ళినవారు పండగకి అత్తారింటికి వెళ్ళి వచ్చినట్లే వెళ్ళి వచ్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే మిగిలిన మూడున్నరేళ్ళు కూడా ఇలాగే కాలక్షేపం చేస్తుందే తప్ప అవినీతికి పాల్పడినవారినీ ఏమీ చేయలేదనిపిస్తుంది.

వైసీపీ విషయానికి వస్తే, ఆ పార్టీకి ఎంతసేపు దేనిలో తమకి ఎక్కువ రాజకీయ మైలేజ్ లభిస్తుందనే లెక్క కట్టుకొని దానినే ‘ప్రజా సమస్యపై పోరాటం’ అని చెప్పుకుంటూ హడావుడి చేస్తుంది తప్ప నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అంటే గుంతలు పడిన రోడ్లకు ప్రభుత్వం మరమత్తులు చేయించకపోవడం వంటివాటిపై పోరాడేందుకు ఇష్టపడదు.

ఎందుకంటే అవి ‘స్పైసీ’ కావు వాటి ‘షెల్ఫ్ లైఫ్’ చాలా తక్కువ కనుక! ఈవిదంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు రాజకీయ కాలక్షేపం చేస్తున్నట్లే అనిపిస్తుంది తప్ప నిజంగా పనిచేస్తున్నట్లు అనిపించదు.

ADVERTISEMENT
Latest Stories