జస్ట్ ఆస్కింగ్: ప్రకాష్ రాజ్‌

prakash_raj

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ తిరుమల వివాదం, దాంతో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ సున్నితంగా చెపుతున్నారు. ఈరోజుల్లో నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వెల్లడిస్తేనే ఎవరో ఒకరు విమర్శిస్తుంటారు.

కానీ ఆయన టిడిపి కూటమి తీరుని మాత్రమే ప్రశ్నిస్తూ ట్వీట్స్ చేస్తుండటంతో సహజంగానే దాని మద్దతుదారులు ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారు.

ADVERTISEMENT

అయితే అలాంటివాటికి భయపడి వెనక్కు తగ్గేరకం కాదు ఆయన. కనుక ఏపీలో రాజకీయ పరిణామాలపై రోజుకో ట్వీట్‌ బాణం సందిస్తూనే ఉన్నారు.

“చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్” అంటూ నటుడు కార్తీ చేత పవన్‌ కళ్యాణ్‌ క్షమాపణ చెప్పించుకోవడాన్ని తప్పు పట్టారు.

ఈ విషయంలో పవన్‌ కళ్యాణ్‌ తొందరపడిన్నట్లే చెప్పవచ్చు. కార్తీకి పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్ ఇస్తున్నట్లు ట్వీట్‌ చేయడంపై కోలీవుడ్‌ అసహనం వ్యక్తం చేస్తోంది. బహుశః అందుకే పవన్‌ కళ్యాణ్‌ కార్తీని అభినందిస్తూ ట్వీట్‌ చేసి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ తర్వాత మళ్ళీ “గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?” అంటూ పవన్‌ కళ్యాణ్‌ ధోరణిలో మార్పులని ప్రకాష్ రాజ్‌ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు పవన్‌ కళ్యాణ్‌ ఇంకా జవాబు చెప్పలేదు. కానీ అభిమానులు మాత్రం ప్రకాష్ రాజ్‌ని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.

కానీ ముందే చెప్పుకున్నట్లు ప్రకాష్ రాజ్‌ అటువంటివాటికి భయపడి వెనక్కు తగ్గే రకం కాదు. అందుకే ఇవాళ్ళ “మనకేం కావాలి… ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..‌పరిపాలనా సంబంధమైన..‌అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్” అంటూ మరో ట్వీట్‌ బాణం సందించారు.

ప్రకాష్ రాజ్‌ ట్వీట్స్‌తో రెండు పాయింట్స్ కనిపిస్తున్నాయి.

ఒకటి భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఇటువంటి అంశాలతో రాజకీయాలు చేస్తుండటం సరికాదని ఆయన సూచిస్తున్నట్లు భావించవచ్చు.

రెండోది బీజేపీ అనుసరించే హిందుత్వ అజెండాని పవన్‌ కళ్యాణ్‌ అందిపుచ్చుకొని కొనసాగిస్తుండటం సరికాదని సూచిస్తున్నట్లుంది.

ప్రకాష్ రాజ్‌కి ఏపీతో, ఏపీ రాజకీయాలతో సంబంధం ఏమిటి? అనే ప్రశ్న ఆయన ప్రశ్నలకు సమాధానం కాదు. అలా ఎదురుదాడి చేసి ఆయన నోరు మూయించడం వలన ఎవరి అభిప్రాయాలూ మారవు కూడా. కనుక ఆయన అభిప్రాయాలలో మంచిని స్వీకరించగలిగితే మంచిది.

అదేవిదంగా తప్పంతా టిడిపి కూటమి ప్రభుత్వానిదే అన్నట్లు ప్రకాష్ రాజ్‌ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం కూడా సరికాదు. తిరుమల వివాదంపై జగన్‌ చేస్తున్న రాజకీయాలను కూడా ఆయన ధైర్యంగా ప్రశ్నించగలిగి ఉంటే అందరూ హర్షించేవారు.

కానీ జగన్‌ ప్రస్తావన చేయకుండా తప్పంతా టిడిపి కూటమి ప్రభుత్వానిదే అని తీర్మానించేయడం తప్పు. కనుక ఆయన కూడా తన అభిప్రాయాలను సరిదిద్దుకుంటే బాగుంటుంది. జస్ట్ టెల్లింగ్!

ADVERTISEMENT
Latest Stories