ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయబోతున్న సంగతి తెలిసిందే. కనుక ముందుగా ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ప్రజాభిప్రాయం తదితర అంశాలపై తన ఇండియన్ పోలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) చేత రాష్ట్రంలో సర్వే చేయించారు.
ఇటీవల ఆయన హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ని కలిసి తన నివేదికను సమర్పించారు. దానిలో కనీసం 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారు తమ మెరుగుపడకపోతే మార్చక తప్పదని ఆ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కొత్తగా మరో విషయం బయటపడింది. ఆ ఎమ్మెల్యేల సంఖ్య 50 అని తాజా సమాచారం.
ఆ నివేదికను సీరియస్‌గా తీసుకొన్న సిఎం కేసీఆర్ వారందరికీ ప్రశాంత్ కిషోర్ చేతే ఈ విషయం చెప్పించినట్లు తెలుస్తోంది. సిఎం కేసీఆర్ ఆదేశం మేరకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదే రోజు ఆ 50 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు పిలిపించి ఓ స్టార్ హోటల్‌లో రహస్యంగా ప్రశాంత్ కిషోర్‌తో సమావేశపరిచినట్లు తెలుస్తోంది.
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే ప్రశాంత్ కిషోర్ వారందరికీ తన నివేదికను చదివి వినిపించి, ఇకనైనా పనితీరు మెరుగుపరుచుకోవాలని లేకుంటే ఓటమి ఖాయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలలో 105కి పైగా సీట్లు గెలుచుకొంటామని సిఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, ఆయన వంటి రాజకీయ మేధావి ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకోవడం చూస్తే టిఆర్ఎస్ పరిస్థితి అంత గొప్పగా లేదని ఆయన కూడా గ్రహించినట్లే ఉన్నారు. ఆయన ఊహించినట్లే 50 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇవ్వడంతో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది.



