పాపం ప్రశాంత్ కిషోర్… బీహార్‌లోనే బుక్ అయిపోతారా?

Prashant Kishor speaking at a political event in Bihar during election campaign

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌, బీజేపి వంటి జాతీయ పార్టీలతో సహా ఏపీలో వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలకి సైతం పనిచేశారు. ఆయన ద్వారా ఆయా పార్టీలు ఎన్నికలలో గెలిచి లబ్ది పొంది ఉండవచ్చు. కానీ ఆయన కూడా ఆయా పార్టీల రాజకీయాలను, వాటి బలాలు, బలహీనతలను ఔపోసన పట్టారు.

ఆ తర్వాత ఆయన తన సొంత రాష్ట్రంలో బీహార్‌లో ‘జన సూరజ్’ అనే పార్టీ పెట్టుకున్నారు. గత రెండేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని నిర్మించుకొని, త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో పోటీకి సిద్దమయ్యారు. కానీ సొంత పార్టీ పెట్టుకోవడమే కొంప ముంచేలా ఉంది.

ADVERTISEMENT

దేశంలో అనేక పార్టీలకు పనిచేసి వాటిలో కొన్నిటిని గెలిపించిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు సొంతంగా పెట్టుకొన్న పార్టీని గెలిపించుకోలేక ఓడిపోతే పరువు పోతుంది. పైగా ఇకపై దేశంలో ఏ పార్టీ అయనని బుక్ చేసుకోకపోవచ్చు. కనుక ఆయన అతి విశ్వాసంతో పార్టీ పెట్టుకొని తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయిందని చెప్పవచ్చు.

తెలంగాణలో బీఆర్ఎస్‌, తమిళనాడు ద్రవిడ పార్టీలు ప్రాంతీయవాదం, భాషలతో రాజకీయాలు చేస్తుంటాయనే సంగతి తెలిసిందే. దేశంలో విభిన్న సిద్దాంతాలు కలిగిన వివిధ పార్టీలను ఎన్నికలలో గెలిపించిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ఆ పార్టీల బాటలోనే సాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇటీవల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బీహార్‌లో రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ కిషోర్ పదేపదే ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ బిహారీల ఆత్మగౌరవాన్ని కించపరిచిందని దానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో తెలంగాణ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి తన సాయం కోరారని, ఇప్పుడే ఆయన బీహారీల పట్ల చులకనగా, చాలా అవమానకరం మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశం వస్తే తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెపుతానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

రోట్లో తల పెట్టాక రోకటి పోటుకి భయపడి ప్రయోజనం ఉండదు. కనుక ఇటువంటి మాటలతో బీహార్‌ ఓటర్లను రెచ్చగొట్టి ఆకట్టుకొని ఎన్నికలలో తన పార్టీని గెలిపించుకోవాలని ఆరాటపడుతున్నట్లున్నారు. అంటే బీఆర్ఎస్‌, ద్రవిడ పార్టీలను ఆయన అనుకరిస్తున్నారన్న మాట!

కానీ వేరే రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి, స్టాలిన్ లేదా మరొకరిని ఎన్నికలలో ఓడించేందుకు ఆయన బయలుదేరాలంటే, ముందుగా బీహార్‌ ఎన్నికలలో గెలవాలి. లేకుంటే ఆయన కూడా కేసీఆర్‌లాగే ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చావడం అంటే ఇదేనేమో?

ADVERTISEMENT
Latest Stories