ఏపీలో టిడిపి ప్రతిపకక్షంలోకి మారినప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది. అయితే వాటిపై వైసీపీ నేతలు నోటికి పని చెప్పేవారే కానీ ఇప్పటిలా ఎదురుదాడులకు పాల్పడలేదు. ఎందుకంటే ఇదివరకు టిడిపి తన నిరసన కార్యక్రమాలకి మూస పేర్లు పెట్టుకోవడం వల్ల కావచ్చు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలను కూడా ఆలోచింపజేసేలా ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి?’ వంటి చాలా క్యాచీ పేర్లు పెడుతుండటమే కారణంగా కనిపిస్తోంది. వాటితో సామాన్య ప్రజలే కనెక్ట్ అవుతున్నప్పుడు వైసీపీ శ్రేణులు కనెక్ట్ అవవా?అంటే అవడమే కాదు… వైసీపీ నేతలు భగభగమండిపోతున్నారు.
అందుకే కొన్ని రోజుల క్రితం మాచెర్లలో టిడిపి శ్రేణులు ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి?’ కార్యక్రమం చేపట్టబోతే వైసీపీ శ్రేణులు అడ్డుకోవడమే కాకుండా ఎదురుదాడి చేసి మాచర్ల టిడిపి ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. తాజాగా చిత్తూరు జిల్లాలో సోమల మండలంలోని నంజంపేటలో పుంగనూరు టిడిపి ఇన్‌ఛార్జ్ చాలా రామచంద్రారెడ్డి అధ్వర్యంలో టిడిపి శ్రేణులు ఇదేం ఖర్మ రాష్ట్రానికి? కార్యక్రమంలో చేపట్టబోతే వైసీపీ శ్రేణులు అడ్డుకొని కర్రలు, రాళ్ళతో దాడి చేశాయి. దాంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకొన్నాయి. అక్కడే ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు చాలా శ్రమపడాల్సివచ్చింది. ఈ దాడులలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.
టిడిపి కార్యకర్తలు మొదట హరిజనవాడలో ఈ నిరసన కార్యక్రమం చెప్పట్టాలనుకొన్నారు. కానీ ఈ విషయం ముందే తెలుసుకొన్న వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని టిడిపి కార్యకర్తలు లోనికి ప్రవేశించకుండా అడ్డుపడ్డారు. దాంతో వారు మరో ప్రాంతానికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టబోతే అక్కడకీ వైసీపీ కార్యకర్తలు చేరుకొని అడ్డుకోవడంతో టిడిపి కార్యకర్తలు సహనం కోల్పోయి వారిపై దాడి చేశారు. దాంతో వైసీపీ కూడా ఎదురుదాడి చేయడంతో ఆ ప్రాంతం యుద్ధవాతావరణం నెలకొంది. చివరికి పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను చెదరగొట్టారు.
తాము ప్రజాస్వామ్యాన్ని చాలా గౌరవిస్తామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకొంటారు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమం చేపడితే దానిపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా విమర్శలు గుప్పిస్తుంటారు. క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలు ప్రతిపక్షాలపై ఈవిదంగా దాడులు చేస్తుంటారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడామంటే ఇదేనా?



