రాజకీయ పంచాంగాలు ఏవిదంగా ఉంటాయో ఇదివరకే చెప్పుకున్నాము. వాటికి తాజా ఉదాహరణ తాడేపల్లి ప్యాలస్‌లో ప్రముఖ అవధాని నారాయణమూర్తి పంచాంగమే. ఆయన పంచాంగ శ్రవణంలో రెండు వేర్వేరు అంశాలున్నాయి.
1. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయి. వాటితో బీడు భూములకు కూడా నీళ్ళు అందుతాయి. కనుక పంటలు బాగా పండుతాయి. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తాయి. ప్రభుత్వ ఆదాయం బాగా పెరుగుతుంది.
2. సాధారణంగా ఎన్నికలలో ఓడిపోతే చాలా మంది భయపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా భయపడలేదు. చాలా ధైర్యంగా, నిబ్బరంగా పార్టీని నడిపిస్తున్నారు. మిథునరాశి వారికి ఈ విశ్వావసు సంవత్సరంలో అంతా మంచే
జరుగుతుంది. జగన్ మిథునరాశిలోనే జన్మించారు. కనుక ఆయన మళ్ళీ మంచిరోజులు రాబోతున్నాయి. ప్రజలు ఆవేశంతో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. జగన్ శ్రీకృష్ణదేవరాయలులా చరిత్రలో
నిలిచిపోయే వ్యక్తి. మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తారు. పూర్వపు సాంఘిక వైభవం మళ్ళీ పొందుతారు,” అని చెప్పారు.
అవధానిగారు చెప్పిన వాటిలో వర్షాలు పడే అవకాశాలు ఉండవచ్చు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఫలిస్తోంది కనుక రాష్ట్రాభివృద్ధి గురించి ఆయన చెప్పినవన్నీ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక జగన్ ఏ రాశిలో జన్మించినా ఆయన రాజకీయ జీవితం మరింత దయనీయంగా మారే అవకాశాలే తప్ప కనుచూపు మేర మంచిరోజులు వచ్చే అవకాశం లేనేలేదని రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు.
కానీ తనకు సంతోషం కలిగించే మాటలే వినేందుకే తనని పిలిపించుకున్నారనే వివేకం అవధానిగారికి ఉంది. కనుకనే ఆయన వినాలనుకుంటున్న నాలుగు ముక్కలు చెప్పి సంతోషపరిచారని భావించవచ్చు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాషని నిర్ధాక్షిణ్యంగా చంపేయాలని ప్రయత్నించగా, తెలుగు భాషకు పట్టం కట్టిన మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయనతో జగన్‌ని పోల్చడం చూసి వైసీపీ నేతలైనా నవ్వుకోకుండా ఉండగలరా?
ప్రజలు ఆవేశంతో జగన్‌ని గద్దె దించలేదు బాగా ఆలోచించే గద్దె దించారని అందరికీ తెలుసు. జగన్ బాధిత వర్గానికి చెందిన అవధానిగారికి తెలియదనుకోలేము.
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం తేలిక. కనుక ఆయన మెప్పు కోసం అవధానిగారు అలా చెప్పేశారనుకోవచ్చు. కానీ ఏవిదంగా అధికారంలోకి రాగలరో అవధానిగారు కూడా చెప్పలేరు.
ఒకవేళ అవధానిగారికి ధైర్యం ఉంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి ఉంటే, వైసీపీ నేతలు ఆయన పంచే ఊడదీసి ప్యాలస్ నుంచి తరిమి తరిమికొడతారు.
అందుకే జగన్ ముఖ్యమంత్రి, శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఆయన వినాలనుకుంటున్న నాలుగు ముక్కలు చెప్పేసి భద్రంగా బయటపడ్డారనుకోవచ్చు.




