రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీ కాలం జూన్ 21తో ముగియనుంది. కనుక నలుగురికి అవకాశం ఉంది. ఆ నలుగురిలో తెలంగాణకు చెందిన జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేరు వినిపిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆర్ కృష్ణయ్యను మొదట చంద్రబాబు నాయుడు రాజకీయాలలోకి తీసుకువచ్చారు. 2014 శాసనసభ ఎన్నికలకు ముందు ఆయనను పార్టీలో చేర్చుకోవడమే కాక తెలంగాణకు టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఎన్నికలలో ఆర్ కృష్ణయ్య గెలిచారు కానీ టిడిపి ఓడిపోవడంతో గొప్ప అవకాశం చేజారిపోయింది.
ఆ తరువాత ఆయన 2018 ఎన్నికలకు ముందు టిడిపికి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పార్టీ టికెట్ లభించదని పసిగట్టగానే, కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయి టికెట్ పట్టేశారు. కానీ మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను పిలిచి మరీ రాజ్యసభ టికెట్ ఇవ్వబోతునట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం ఆర్ కృష్ణయ్య తాడేపల్లి సిఎం కార్యాలయానికి చేరుకొని సిఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నారు. రాజ్యసభ సీటు ఆశిస్తున్న మరో అభ్యర్ధి మస్తాన్ రావు కూడా కొద్ది సేపటి క్రితం తాడేపల్లి చేరుకొని సిఎంతో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్యల పేర్లుఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు సీట్లకు బీద మస్తాన్ రావు, కిల్లి కృపారాణి, చలమల శెట్టి సునీల్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లేదా ఆయన భార్య ప్రీతి అదానీ పేర్లు సిఎం పరిశీలనలో ఉన్నాయి. వారిలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారో చూడాలి. ఇవాళ్ళ లేదా రేపు దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు కనుక జూన్ 10న జరిగే ఎన్నికలు లాంఛనప్రాయమే అని చెప్పవచ్చు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తే వారు రాజ్యసభకు ఎన్నికైనట్లే.



