గత వారం రోజులుగా బాలీవుడ్ నాట సూపర్ ప్రమోషన్ చేస్తోన్న “రాబ్తా” సినిమా విజయవంతంగా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల అల్లు అరవింద్ చేసిన హంగామాతో టాలీవుడ్ లో కూడా బాగానే ప్రచారం గిట్టుబాటు అయ్యింది. అయితే రిలీజ్ అయ్యింది అన్న ఒక్క ఉపశమనమే తప్ప, చిత్ర యూనిట్ కు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే విమర్శకులు అన్ని వైపుల నుండి చెడుగుడు ఆడుకుంటున్నారు.
బాలీవుడ్ ‘మగధీర’ సినిమాగా పబ్లిసిటీ పొందిన ‘రాబ్తా’ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం దిశగా దూసుకుపోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఏ ప్రతిష్టాత్మక సినిమాకు ఇవ్వలేని విధంగా ట్రేడ్ పండితులు, సినీ విశ్లేషకులు ఈ సినిమాపై దుమ్మెత్తిపోస్తున్నారు. అంతన్నారు… ఇంతన్నారు… చివరికి ధియేటర్లో ప్రేక్షకులు తలలు పట్టుకునే స్థాయికి ‘రాబ్తా’ సినిమా టాక్ ఉండడం విశేషం.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చిత్ర హీరోహీరోయిన్లు సుశాంత్, కృతిసనన్ లు శృతిమించిన పబ్లిసిటీ చేయడంతోనే… నెటిజన్లలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. వాటిని ధృవీకరించే విధంగానే సినీ విశ్లేషకుల తీర్పు కూడా ఉండడంతో, మొదటి రోజునే ఈ సినిమాను పీకేస్తారా? అన్న రేంజ్ లో ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. నాడు రామ్ చరణ్ ‘తుఫాన్’ మాదిరి, 2017లో చెత్త సినిమా అవార్డులను బహుశా ‘రాబ్తా’ కొల్లగొడుతుందేమో!



